దిశ మార్చిన ‘మాదీ’ తుపాను

11 Dec, 2013 01:45 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘మాదీ’ తుపాను క్రమంగా దిశ మారుస్తోంది. రెండు రోజుల క్రితం వరకు చెన్నై తీరానికి సమీపంలో ఉన్న తుపాను మంగళవారం సాయంత్రానికల్లా మచిలీపట్నానికి 430 కి.మీ. దూరానికి పాకింది. ఈశాన్య దిశ నుంచి నైరుతి, తూర్పు ఆగ్నేయ దిశలుగా కిందికి కదులుతూ అదే ప్రాంతంలో స్థిరపడిపోతోంది. మచిలీపట్నం తీరంలో తూర్పు ఆగ్నేయ దిశగా పయనించి ఈ నెల 13 నాటికి తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారుల అంచనా. అయితే ఇప్పటికీ పెను తుపానుగానే ఉన్న ‘మాదీ’ సముద్రంలోనే బలహీనపడి తుపానుగా మారే అవకాశముందని వారు చెబుతున్నారు.

 

తుపాన్ల సీజన్లో ఈ రకంగా దిశ మార్చడం, సముద్రంలోనే మెల్లగా కదులుతూ, ఎక్కువ రోజులు స్థిరపడడం ‘మాదీ’ ప్రత్యేకత అని అంటున్నారు. తొలుత తమిళనాడు-చెన్నై సరిహద్దుపై ప్రభావం చూపిన ఈ తుపాను ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్రపై ప్రభావం చూపడం కూడా విశేషమే. దీని వల్ల రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు, తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి ఈశాన్య దిశగా గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఓడరేవుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. వేటకు వెళ్లే జాలర్లు జాగ్రత్తలు పాటించాలని, ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు తిరిగి రావాలని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.  
 
 ఉత్తర గాలులు, తుపాను వల్లే చలి..


 సముద్రంలో ‘మాదీ’, ఉత్తర భారతం నుంచి దక్షిణానికి వీస్తు న్న శీతల గాలుల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో ఉత్తర గాలులు దిశ మార్చడంతో గడచిన 24 గంటల్లో వాతావరణం కాస్త వేడెక్కిందని, ఈ పరిస్థితి మిగతా ప్రాంతాల్లోనూ ఉంటుందని చెప్పారు. తుపాను దిశ మార్చి, తీరం దాటిపోవడమో, లేదా సముద్రంలోనే బలహీనపడడమో జరిగితే చలి తీవ్రత తగ్గుతుందన్నారు. కాగా, విశాఖ పరిసరాల్లో మంగళవారం సాయంత్రం అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. బుధవారం సాయంత్రంలోగా కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణ, రాయలసీమల్లో వాతావరణం పొడిగా ఉండొచ్చు.
 

మరిన్ని వార్తలు