‘మాఫియా గుప్పెట్లో రాష్ట్రం’ పుస్తకంపై విచారణకు ఆదేశం

12 Apr, 2014 01:28 IST|Sakshi
  • జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసిన నవీన్‌మిట్టల్
  •  పుస్తక ప్రచురణకర్త వర్ల రామయ్యపై  జంపాన కొండలరావు ఫిర్యాదు
  •  ఉయ్యూరు, న్యూస్‌లైన్ :‘మాఫియా గుప్పెట్లో రాష్ట్రం’ పుస్తక పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. వైఎస్సార్ సీపీ ఉయ్యూరు మున్సిపల్ రెండో వార్డు అభ్యర్ధి జంపాన కొండలరావు ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశిం చింది. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్‌మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... గత నెల 30న జరిగిన ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసి తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడింది.

    ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రచురించిన ‘మాఫియా గుప్పెట్లో రాష్ట్రం’ పుస్తకాలను ఇంటింటికీ పంపిణీ చేసింది. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితోపాటు మరి కొంత మందిపై అసత్య ఆరోపణలతో బురదజల్లింది. ఈ చర్యలను పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ పుస్తక పంపిణీపై ఎన్నికల ప్రత్యేక అధికారి పుష్పమణి, ఎన్నికల అధికారి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.

    ఘటనపై విచారణకు ఆదేశించి చర్యలు చేపట్టకపోవడంతో జంపాన కొండల రావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ నెల ఒకటో తేదీన ఫిర్యాదు చేశారు. పుస్తక పంపిణీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరికాదని, పుస్తక ప్రచురణకర్త వర్ల రామయ్య ఈ మున్సిపాలిటీలో పోటీ చేసిన వ్యక్తి కాదు, ఓటరు కాదని, అలాంటి వ్యక్తి ఎలాంటి అనుమతి లేకుండా పుస్తకాలను ముద్రించి ఎలా పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.

    వర్ల రామయ్య గతంలో ఉయ్యూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారని, అనేక ఎన్నికల నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తే ఇలా నిబంధనలు ఉల్లంఘిం చడం సరైందికాదని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పొందుపరిచారు. ఫిర్యాదు స్వీకరించిన సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ విచారణకు ఆదేశించారు. పుస్తక పంపిణీపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
     

మరిన్ని వార్తలు