ఎంపీ మాగుంట కార్యాలయం ముట్టడి

4 Oct, 2013 03:08 IST|Sakshi
 ఒంగోలు కార్పొరేషన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 156 శాఖల ఉద్యోగులు ఉద్యమిస్తుంటే సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పదవికి రాజీనామా చేయని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయాన్ని ఉద్యోగులు గురువారం ముట్టడించారు. కార్యాలయం గేటు ఎదుట కూర్చుని 48 గంటలపాటు ఆందోళన వ్యక్తం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని విభజించకుండా కాంగ్రెస్ అధిష్టానంపై ఎంపీ ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్‌బషీర్ మాట్లాడుతూ విభజన వల్ల వివిధ వర్గాలు, ప్రాంతాల ప్రజలకు వచ్చే కష్టనష్టాలపై ఎటువంటి చర్చ జరగకుండా టీ నోట్‌పై క్షణానికో ప్రకటన చేస్తూ సీమాంధ్ర ప్రాంత ప్రజలను కేంద్ర ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. 
 
 రాష్ట్ర విభజనపై ఢిల్లీస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 2014 వరకు రాష్ట్ర విభజన సాధ్యమయ్యే అవకాశం లేదన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాల్సిన అవసరం ఉందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలిపిన వారికే భవిష్యత్తులో ఉద్యోగుల మద్దతు ఉంటుందని బషీర్ స్పష్టం చేశారు. ఎన్జీవో అసోసియేషన్ కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ. 25 కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్ర ప్రాంత ప్రజల సొమ్ము, శ్రమ ఉందని పేర్కొన్నారు.
 
 విభజన వల్ల ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రాజెక్టులకు ఒక్క చుక్క కూడా నీరు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. 64 రోజులుగా ఎన్నో కష్టనష్టాలు భరిస్తూ సీమాంధ్ర ప్రాంత ప్రజలు, ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాల్లో భాగమే ప్రత్యేక తెలంగాణ అంశమని శ్రీనివాసరావు విమర్శించారు. ఉద్యోగులు ఎంపీ కార్యాలయం ఎదుట నడిరోడ్డుపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. భోజనాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాసర్ మస్తాన్‌వలి, రెవెన్యూ సంఘం నాయకుడు కేఎల్ నరసింహా రావు, శరత్‌బాబు, రాజ్యలక్ష్మి, ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రసాద్, నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ సంఘం నాయకులు నాగేశ్వరరావు, వీరనారాయణ, రమణమూర్తి, అన్నపూర్ణమ్మ, విద్యాసాగర్‌రెడ్డి, గృహనిర్మాణశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, వైద్యుల సంఘ నాయకుడు డాక్టర్ ఎం.వెంకయ్య, వ్యవసాయశాఖ జేఏసీ నాయకులు కిషోర్, మున్సిపల్ జేఏసీ నాయకులు వెంకటేశ్వర్లు, రమేశ్, శేఖర్‌బాబు, ప్రసాదరావు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు