శివనామస్మరణతో పోటెత్తిన ఆలయాలు

21 Feb, 2020 08:25 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి: మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు శివాలయాలను దర్శించుకుంటున్నారు. రాజమండ్రిలో గోదావరి ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయంలో స్వామివారి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు. పంచారామ క్షేత్రం అయిన ద్రాక్షారామం, కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి, మురమళ్ళ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంది.

కృష్ణా: శివన్నామస్మరణతో మల్లన్నగట్టు శైవక్షేత్రం మార్మోగుతోంది. వేలాదిగా భక్తులు తరలిరావడంతో పోలీసులు భారీ భద్రతను కల్పించారు. విస్సన్నపేట మండలం కొండపర్వగట్టు శ్రీ భ్రమరాంబిక మల్లేశ్వర స్వామిని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పరమశివుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తోట్లవల్లూరు మండలం ఐలూరులో  రామేశ్వరస్వామిని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. వీరివెంట కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, జొన్నాల మోహనరెడ్డి, మర్రెడ్డి శేషిరెడ్డి, షేక్ లతీఫ్, నడకుదురు రాజేంద్ర, కిలారపు శ్రీనివాసరావు ఉన్నారు.

ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద భక్తులు కోలాహలం నెలకొంది. పండగను పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు తెల్లవారుజామునే ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో శివనామ స్మరణలతో కృష్ణాతీరం ప్రతిధ్వనిస్తోంది. తిరువూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ప.గో: మహాశివరాత్రి సందర్భంగా మంత్రి తానేటి వనిత పట్టిసీమ వీరభద్రేశ్వరుని దర్శించుకున్నారు.

గుంటూరు: కోటప్పకొండ త్రికోటేశ్వరుడిని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమరావతి భక్తులతో అమరేశ్వరుడి ఆలయం కిటకిటలాడుతోంది. వేకువజాము నుంచే కృష్ణ నదిలో స్నానమాచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భారీస్థాయిలో భక్తులు గుడికి తరలి వస్తున్నారు.

విశాఖపట్నం: ఆర్కే బీచ్ లో రాజ్యసభ సభ్యులు టి.సుబ్బిరామిరెడ్డి అధ్వర్యంలో మహా కుంభాభిషేకం నిర్వహించారు. కోటి శివలింగాలకు అభిషేకాలు చేపట్టారు. శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాదికారి స్వామి స్వత్మానందేంద్ర సరస్వతి మహా కుంభాభిషేకాన్ని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు చిత్తూర్ ఎంపీ రెడ్డప్ప, సినీ నటులు వాణి శ్రీ, శారద, కవిత, మురళీమోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతగిరి మండలం బొర్రా గుహల్లో నేడు ప్రవేశం ఉచితమని అధికారులు ప్రకటించారు. కాశీపట్నంలోని ఉమా రామలింగేశ్వర ఆలయం, బొర్రా గూహ లోని మహా శివలింగానికి, కిముడుపల్లిలో స్వయంభు శివలింగానికి గిరిజనులు అభిషేకాలు చేస్తున్నారు. అఫీషియల్ కాలనీలోని వైశాకేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి శివరాత్రి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. హుకుంపేట మండలం మత్స గుండంలో, సబ్బవరం లోని భీమా లింగేశ్వర ఆలయం, లింగాల తిరుగుడు లోని సోమేశ్వరాలయం, చోడవరం లోని గౌరీ, పార్వతి సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అప్పికొండ పుణ్యక్షేత్రంలోనూ పెద్ద ఎత్తున అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు రానుండడంతో ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు.

చిత్తూరు: సోమల మండలంలోని దుర్గం కొండలోని శివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిరవహించారు. కట్టమంచి కులుండీశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసులు దర్శించారు.

పశ్చిమ గోదావరి జిల్లా: ఆచంట ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరామేశ్వర స్వామివారిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాధరాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భీమవరంలోని పంచారామక్షేత్రం ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ద్వారకాతిరుమల శేషాచల కొండపై కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేస్తున్నారు. నరసాపురంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. పాలకొల్లు పంచారామక్షేత్రంలోని క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమానీలకంఠేశ్వర క్షేత్రంలో స్వామివారు విశేష అభిషేకాలు అందుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం, తాడువాయి శివాలయాలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. పట్టిసీమ పట్టిసాచలక్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపిస్తోంది. వీరభద్రేశ్వర స్వామికి వంశపారంపర్య ధర్మకర్తలు తొలిపూజ నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

ప్రకాశం: సీఎస్  పురం  మండలంలోని బైరవకోన లో మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండే భక్తులు బారులు తీరారు.

నెల్లూరు: నగరంలో మాగుంట సర్కిల్ లో బ్రహ్మ కుమారీల ఆధ్వర్యంలో 18 అడుగుల శివలింగం ఏర్పాటు చేశారు. ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాతో ప్రతిష్టించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న భక్తులు అభిషేకాలు చేస్తున్నారు. కావలి పాత ఊరులోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. మూలస్థానేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మైపాడు, కాటేపల్లి, పట్రాంగంలలో భక్తులు సముద్ర స్నానాలు చేసిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఘటిక సిద్దేశ్వరం ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సంగంలో పినాకినీ నదిలో స్నానమాచరించి సంగమేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. రాపూరు మండలం సిద్దేశ్వర కోన లో విశేష పూజలు చేపట్టారు. బుచ్చిరెడ్డి పాలెం మండలం జొన్నవాడలోని శ్రీ కామాక్షి తాయి సమేత మల్లిఖార్జున స్వామి వారి ఆలయంలో శివ రాత్రి సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించనున్నారు.

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో తెల్లవారుజామున 2 గంటల నుంచే దర్శన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌ రెడ్డి, ఆలయ ఈవో చంద్రశేఖర్‌ రెడ్డిలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కాకినాడ: సామర్లకోట కుమారా రామ భీమేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించిన భక్తులు ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వరం ఆలయంలో ఘనంగా శివరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. పుష్కరిణిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు దంపతులు ప్రత్యేక పూజలు చేపట్టారు.

వైఎస్సార్ కడప: రాజంపేట మండలం ఊటుకూరులోని భక్తకన్నప్ప జన్మస్థలమైన శివాలయానికి శివభక్తులు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తకన్నప్ప ఆలయం శివనామస్మరణలతో మారుమోగుతోంది. బద్వేలు నియోజకవర్గంలో శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. లంకమల, మల్లెంకొండ, గండి క్షేత్రంలోని దేవాలయాలకు తెల్లవారు జామునుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పరుశురాముడు మాతృహత్యా పాతకం నుంచి విముక్తి పొందిన రాజంపేట మండలం హత్యరాలలో శివుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. హత్యరాల శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వరున్ని దర్శించుకుని పులకించిపోతున్నారు. రైల్వే కోడూరులో శ్రీ భుజంగేశ్వర ఆలయంలో భక్తులు బారులు తీరారు. శివపార్వతుల కల్యాణోత్సవం కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు.

చిత్తూరు జిల్లా: కట్టమంచి కులుండీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రావారిపాళెంలో తలకోన సిద్దేశ్వర స్వామికి రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమరగపించారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నేడు ఉదయం రథోత్సవ సేవ నిర్వహించారు. రథంపై తిరుమాఢ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. రాత్రికి అశ్వవాహనంపై తిరిగి ఊరేగించనున్నారు. ఎర్రవారిపాళ్ళెం మండలం తలకోనలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పార్వతి పరమేశ్వరులకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శేషవస్త్రాలు సమర్పించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పలు శివాలయాకు ఆయన శేషవస్త్రాలు అందించారు.

తిరుమల: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ పరమశివుని ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

విజయవాడ: పున్నమిఘాట్, క్రుష్ణవేణి, పవిత్ర సంగమంతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలాచరిస్తున్నారు. పాత శివాలయం, యనమలకుదురు శివాలయం, వేదాద్రి, ముత్యాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శివయ్య దర్శనార్థం వేకువజామునే భక్తులు బారులు తీరారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా: పెదపూడి మండలం గొల్లల మామిడాడ పాటిమీద వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి రథోత్సవం కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అల్లవరం మండలం గోడి గ్రామంలోని శివాలయంలో ఎంపి చింతా అనురాధ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాట్రేనికోనలో కుండలేశ్వర స్వామి వారిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ  మంత్రి పినిపె విశ్వరూప్ దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి ఘాట్‌ల​కు భక్తులు పోటెత్తారు. సూర్యోదయానికి ముందు నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. కోటిలింగేశ్వరస్వామి ఆలయం, ఉమా మార్కండేయ స్వామి ఆలయాలు శివనామస్మరణతో హోరెత్తిపోతున్నాయి. గౌతమి గోదావరి నది తీరంలోని పంచారామక్షేత్రం ద్రాక్షారామం, కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి, మురమళ్ళ వీరభద్రేశ్వరస్వామి ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఉదయాన్నే స్నానమాచరించి కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దక్షిణకాశిగా పేరుగాంచిన ద్రాక్షారామంలో కొలువైన మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దంపతులు దర్శించుకున్నారు.

అనంతపురం: గుంతకల్లు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో మహా శివరాత్రివేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ విశేషంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. మొదటిరోడ్డు శివాలయంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాల అభివృద్ధి కి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

శ్రీకాకుళం: కోటేశ్వర స్వామి, శ్రీముఖలింగం మధుకేశ్వరస్వామి, రావివలస ఎండలమల్లికార్జున స్వామి దేవాలయాలు పండగను పురస్కరించుకుని సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.

మరిన్ని వార్తలు