బంగారుహారాలు ఇచ్చినా పట్టించుకోరు

30 Aug, 2019 10:36 IST|Sakshi
అమ్మవారికి భక్తులు ఇచ్చిన ఆరు తులాల బంగారు హారం

ఆభరణాలిచ్చి ఏడాదైనా దాతలకు అందని రసీదులు 

అనధికారిక వ్యక్తులతో నాణ్యత పరీక్షలు 

సాక్షి, మహానంది: భక్తులు స్వామి వారికి కానుకలిస్తే వెంటనే సంబంధిత రసీదును దాతలకు అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో దీనిని గమనించి ఉంటాం. అయితే మహానందిలో అధికారులు మాత్రం ఇందుకు భిన్నం. ఏడాది గడుస్తున్నా..దాతలకు రసీదులు ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అమ్మవారికి చీర ఇచ్చినా రసీదు వెంటనే ఇవ్వరు...లక్షల విలువ చేసే బంగారుహారాలు ఇచ్చినా పట్టించుకోరు. పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో ఓ ఉన్నత ఉద్యోగి, మరో ఇద్దరు చిరుద్యోగులు తమ కనుసన్నల్లోనే అంతా నడిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

బుధవారం దేవదాయశాఖకు చెందిన అప్రైజర్‌(బంగారు, వెండి పరీక్షించే నిపుణుడు)తో కాకుండా ప్రైవేటు అప్రైజర్‌తో బంగారు కానుకల నాణ్యత ప్రమాణాలు పరిశీలించడం, అన్నదాన మండపాల్లో తూకాలు వేయడం విమర్శలకు తావిచ్చింది. మహానంది దేవస్థానానికి సుమారు రెండు కిలోల బంగారు, 200 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఇన్ని ఆభరణాలున్నా సరైన లాకర్‌ లేదు. మహానంది దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న అర్చకుడు మూలస్థానం శివశంకర శర్మ ఈ ఏడాది జనవరి 13వ తేదీన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి 200 గ్రాముల వెండి వడ్డాణాన్ని అందించారు. 8నెలలు అయినా రసీదును అందించకపోవడం వెనుక పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే గాజులపల్లెకు చెందిన మురళీసోదరులు వెండి పళ్లాన్ని అందించగా పదిసార్లు ఫోన్‌చేస్తే గాని రసీదును అందించలేదు.

ఈ రెండు సంఘటనలే అధికారుల పర్యవేక్షణ, నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మహానందిలో వెలిసిన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి ఆలయ వేదపండితులు, అర్చకులు, దేవస్థానం ఉద్యోగులు అందరూ కలిసి 108 స్వర్ణ కమలాలను చేయించారు. తయారు చేయించి ఈ ఏడాది ఏప్రిల్‌ 6వ తేదీన దేవస్థానం ఈఓకు అందించారు. కానీ ఆ రోజు ఇచ్చిన స్వర్ణ కమలాలకు సంబంధించిన రసీదులను దేవస్థానం సిబ్బంది బుధవారం అర్చకులకు అందివ్వడం చర్చనీయాంశంగా మారింది.

అమ్మవారికిచ్చిన చీరలెక్కడో? 
మహానంది దేవస్థానంలో వెలిసిన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి భక్తులు చీరలు సమర్పిస్తుంటారు.  మహానందికి చెందిన న్యాయవాది గంగిశెట్టి రాజేశ్వరరావు సుమారు రూ. 12వేల విలువైన చీరను అందించారు. అది ఎక్కడుందో నేటికీ అధికారులు చెప్పలేకున్నారు. ఈ చీరే కాకుండా మరో దాత ఇచ్చిన చీర కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహానంది దేవస్థానంలో టెండరుదారులు వారి బకాయిలు చెల్లించే సమయంలో ఇచ్చే రసీదుల్లో సైతం సూపరింటెండెంట్, ఈఓల సంతకాలు ఉండవు. రూ. వెయ్యి అయినా సరే రూ. 5లక్షలైనా సరే కేవలం గుమస్తా మాత్రమే రసీదుల్లో సంతకాలు చేయడం దేవదాయశాఖ చరిత్రలో ఈ ఆలయంలో మాత్రమే ఉంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా పనిచేసే ఉద్యోగులే ఇక్కడ కీలకంగా మారడం, వారి కనుసన్నల్లోనే పాలన నడుస్తుండటం ఇందుకు కారణమని తెలుస్తోంది.


 

మరిన్ని వార్తలు