అభివృద్ధికి పునరంకితమవుదాం

16 Aug, 2013 01:53 IST|Sakshi

మచిలీపట్నం, న్యూస్‌లైన్ : స్వాతంత్య్ర ఉద్యమంలో అసువులు బాసిన మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి పునరంకితమవ్వాలని కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కలెక్టర్ పోలీసులు, సాయుధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. వ్యాపారం చేసేందుకు వచ్చిన బ్రిటీష్‌వారు మన సంపదను దోచుకుని, సైనిక బలంతో విభజించు, పాలించు సిద్ధాంతాన్ని అమలు చేశారన్నారు. 200 ఏళ్ల పాటు విదేశీ పాలకుల కబంధ హస్తాల్లో నలిగిపోయిన భారత జాతికి స్వాతంత్య్రం సాధించేందుకు ఝాన్సీలక్ష్మీబాయ్, తాంతియాతోపే, అవద్‌రాణి, బేగంసాహెబా, మంగళ్‌పాండే, దాదాభాయ్ నౌరోజీ, సురేంద్రనాధ్ బెనర్జీ, బాలగంగాధర తిలక్, లాలా లజపతిరాయ్, రాజా రామ్మోహన్‌రాయ్, జ్యోతిరావ్‌ఫూలే, ఎంజీ రెనడే, అల్లూరి సీతారామరాజు, మహాత్మాగాంధీ వంటి ఎందరో మహానుభావులు ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. ముట్నూరి కృష్ణారావు స్థాపించిన కృష్ణాపత్రిక, గాడిచర్ల వారి స్వరాజ్యపత్రిక, కాశీనాథుని నాగేశ్వరరావు ప్రారంభించిన ఆంధ్రపత్రిక జాతీయోద్యమంలో కీలకపాత్ర వహించాయని చెప్పారు.

 జిల్లాకు ప్రత్యేక స్థానం
 దేశ స్వాతంత్య్ర పోరాటంలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని కలెక్టర్ చెప్పారు. మహాత్మాగాంధీ ఈ జిల్లాలో పర్యటించినప్పుడు ప్రజలు ఆయనకు బాసటగా నిలిచారన్నారు. స్త్రీ సమాజం స్థాపించి మహిళలను చైతన్యపరిచిన నందిగామ వాసి బండారు అచ్చమాంబ, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా చారిత్రక కోనేరుసెంటరులో భారత జాతీయ జెండా ఎగురవేసిన తోట నరసయ్యనాయుడు వంటి వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. త్యాగం, శాంతి, సత్యం, అహింస, ధర్మాలకు పాడిపంటలు, పరిశ్రమలకు గుర్తుగా మహాత్మాగాంధీ ఆదేశాల మేరకు మూడు గంటల వ్యవధిలోనే జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య జిల్లా వాసి కావడం గర్వకారణమన్నారు. జిల్లాకు చెందిన కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, కొమర్రాజు లక్ష్మణరావు, గొట్టిపాటి బ్రహ్మయ్య, వేమూరి రాంజీరావు, కొప్పల్లె హనుమంతరావు, డాక్టర్ బోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి మహనీయుల త్యాగాల ద్వారానే స్వాతంత్య్ర ఫలాలు మనం అనుభవిస్తున్నామని వివరించారు.

 యువత కష్టపడి పనిచేయాలి..
 ‘లెండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకండి’ అన్న స్వామి వివేకానంద మాటలను యువత పాటించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సూచించారు. దేశ అభివృద్ధికి యువత కష్టపడాలన్నారు. జిల్లా అభివృద్ధిలో తోడ్పాటు అందిస్తున్న స్వాతంత్య్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.


 స్వాతంత్య్ర సమరయోధులను మర్యాదపూర్వకంగా కలుసుకుని సన్మానించారు. ఈ వేడుకల్లో ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.చక్రధరరావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, జేసీ పి.ఉషాకుమారి, ఏజేసీ ఎన్.రమేష్‌కుమార్, డీఆర్వో ఎల్.విజయచందర్, ఏఎస్పీ శెముషీబాజ్‌పాయ్, అవనిగడ్డ ఉప ఎన్నికల పరిశీలకుడు మనీషీమోహిన్, డీఎంఅండ్ హెచ్‌వో సరసిజాక్షి, డీఈవో దేవానందరెడ్డి, జిల్లా న్యాయమూర్తులు పి.కేశవాచార్యులు, ఎ.నాగశైలజ, ఎం.అనురాధ, ఎ.అనిత, ఎల్.తేజోవతి, చిన్నంశెట్టి రాజు, స్వాతంత్య్ర సమరయోధులు మేకా నరసయ్య, చిల్లర మోహనరావు, కొండపల్లి పాండురంగారావు, ఆర్డీవో సాయిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు