ఫ్లెక్సీల ఏర్పాటుపై ఆలయాల మధ్య గొడవ 

24 Aug, 2019 08:16 IST|Sakshi
మహాయోగి లక్ష్మమ్మవ్వ ఫ్లెక్సీ అతికిస్తుండగా అడ్డుకుంటున్న పీఠాధిపతి సన్నిహితుడు

మహాయోగి లక్ష్మమ్మవ్వ ఆలయం వర్సెస్‌ శ్రీమఠం

సాక్షి, మంత్రాలయం : అత్యుత్సాహమో.. అనాలోచితమో తెలియదుగానీ ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో శ్రీమఠం, ఆదోని మహాయోగి లక్ష్మమ్మవ్వ ఆలయం మధ్య వార్‌ నడుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆరాధన వేడుకల మునుపు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ప్రాంగణంలో ఇనుప బోర్డుపై ఆదోని మహాయోగి లక్ష్మమ్మవ్వ ఫ్లెక్సీ ప్రదర్శించారు. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా అవ్వ ఫ్లెక్సీని తొలగించి రాములోరి, పీఠాధిపతుల ఫ్లెక్సీ వేశారు. ఉత్సవాలు ముగియడంతో భక్తులు అవ్వ ఫ్లెక్సీ తెచ్చి గురువారం పాత బోర్డుపై అతికించారు.

ఆ సమయంలో అటుగా వెళ్తున్న పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు సన్నిహితుడు గోరుకల్లు కృష్ణస్వామి చూసి ఏర్పాటును అడ్డుకున్నారు. ఇరువురు మధ్య కాసేపు చర్చలు జరిగాయి. అంతటితో ఆగకుండా శ్రీమఠం వారు రాత్రికి రాత్రి ఆ ఫ్లెక్సీని తొలగించేశారు. ఉదయానికంతా రాములోరి, పీఠాధిపతి ఫ్లెక్సీని ప్రదర్శించి రంగులు సైతం అద్దారు. ఈ క్రమంలో ఇరు ఆలయాల మధ్య కాసింత రగడ మొదలైంది. ఎవరికైనా దేవుళ్లు సమానమే.  దీనికి విరుద్ధంగా  శ్రీమఠం  కొత్త సంప్రదాయానికి తెరతీయడంపై స్థానికులు విస్తుపోతున్నారు.  ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందోనని మంత్రాలయంలో చర్చసాగుతోంది..

మరిన్ని వార్తలు