‘పట్టాలు’ తప్పిన ప్లాన్

7 Feb, 2014 02:38 IST|Sakshi

 కందుకూరు, న్యూస్‌లైన్ :  పట్టణ ప్రజలను ఎంతో కాలంగా ఊరిస్తూ వచ్చిన నివేశన స్థలాల పంపిణీ వ్యవహారం మంత్రి మహీధర్‌రెడ్డికి తలనొప్పిగా మారింది. ఎన్నికలకు ముందు పట్టాలు ఇచ్చి ప్రజల ఓట్లు గుంజాలనుకున్న ఆయన ప్లాన్.. రివర్సైంది. ఓట్లు తెచ్చిపెట్టడం సంగతి అంటుంచి  సొంత పార్టీ నాయకులు ఆయనకు దూరమయ్యారు. దీంతో కొందరు నాయకులను మంత్రి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

 ఇదీ.. జరిగింది
 గత మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వేదికగా మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. పట్టణంలోని దాదాపు 1219 మందికి కలెక్టర్‌తో కలిసి పట్టాలిచ్చారు. అధికారులు తయారు చేసిన జాబితాలో అనర్హులు పెద్ద సంఖ్యలో ఉన్నారని పంపిణీకి ముందే విమర్శలు వెల్లువెత్తాయి. ఇవేమీ పట్టించుకోని మంత్రి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హాడావుడిగా పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. జాబితాలో దాదాపు 40శాతం మందికి ఇళ్లు ఉన్నా మళ్లీ పట్టాలు ఇవ్వడం బహిరంగ రహస్యం.

ఈ వ్యవహారంపై నిజమైన లబ్ధిదారులు గుర్రుగా ఉన్నారు. వీరి సంగతి అటుంచితే.. కనీసం తమ సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోకుండా అర్హుల జాబితా ఎలా తయారు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆగ్రహం మంత్రికి తెలియాలని పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఒక్కరు కూడా హాజరు కాలేదు. పార్టీకి చెందిన వివిధ విభాగాల అధ్యక్షులు, ముఖ్యనాయకులు సైతం మంత్రికి ముఖం చాటేశారు.
 
 అవమానించడం ఆయనకు అలవాటే
 మంత్రి ప్రధాన అనుచరునిగా చెలామణీ అవుతున్న ఓ నేతను కనీసం వేదికపైకి కూడా ఆహ్వానించలేదు. అంతేకాకుండా తనతోటి మండల నాయకుడైన ఏఎంసీ చైర్మన్ తోకల కొండయ్యని వేదికపైకి ఆహ్వానించి, తనను కావాలనే అవమానపరిచే విధంగా మంత్రి వ్యవహరించారని సదరు నాయకుడు సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నాడు.

గతంలో కూడా ఇలానే వ్యవహరించారని, ఆయనకు ఇది అలవాటేనని సదరు నేత మంత్రిపై కినుకు వహించాడట! దీంతో విషయం మంత్రిగారి దృష్టికి వెళ్లడంతో ఆయనే స్వయంగా సదరు నాయకునికి ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మంత్రి ఫోన్ తీసేందుకు కూడా ఇష్టపడని ఆ నాయకుడు.. ఇంత అవమానం జరిగిన తరువాత ఫోన్ చేసి ఏం లాభమని సన్నిహితుల వద్ద వాపోయాడు. మిగిలిన నాయకులదీ ఇదే పరిస్థితి. ఏన్నో ఏళ్లుగా పార్టీ కంటే మహీధర్‌రెడ్డినే నమ్ముకుని పనిచేస్తున్నామని, ఆయన తమను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి పట్టాలు ఇచ్చారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

 తాము వార్డుల్లో తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయిందంటున్నారు. ఇప్పటి వరకూ తిట్టినా.. అవమానించినా సహించామని, మంత్రి వ్యవహారశైలి మారకపోతే పార్టీలో కొనసాగడం కష్టమేనని నాయకులంతా తేల్చి చెప్తున్నారు. పట్టాల పంపిణీ పార్టీకి ఏమాత్రం లాభం చేకూర్చేలా లేదని మరో వాదన వినిపిస్తున్నారు.

 అందరూ అర్హులని అధికారులు చెప్పిన మాటలు నమ్మి పెద్ద ఎత్తున అనర్హులకు పట్టాలు  ఇచ్చారని నాయకులు ఆరోపిస్తున్నారు. ఇళ్లు లేని పేదలు పట్టణంలో భారీ సంఖ్యలో ఉంటే విచారించి న్యాయం చేయాల్సిన మంత్రి.. అధికారుల మాటలు నమ్మి అనర్హులకు పట్టాలు ఇచ్చారని సదరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.        

మరిన్ని వార్తలు