స్కూల్‌కి వెళ్లడం ఇష్టం లేక బస్సులోంచి దూకిన విద్యార్థి  

3 Aug, 2019 08:00 IST|Sakshi
స్కూల్‌ బస్సు, గాయపడిన విద్యార్థి లాలుమోహన్‌   

తలకు తీవ్రగాయాలు 

బస్సులో కనిపించని అటెండర్‌ 

స్కూలు యాజమాన్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం 

సాక్షి, కణేకల్లు: తల్లి బలవంతంతో స్కూలుకు పయనమైన విద్యార్థి బస్సు కదిలి కొంత దూరం వెళ్లాక కిందకు దూకేశాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. కణేకల్లు మండలం ఎన్‌.హనుమాపురం గ్రామానికి చెందిన కురుబ సరోజమ్మ, రాజన్న దంపతుల కుమారుడు కురుబ లాలుమోహన్‌ ఉరవకొండలోని మహేశ్వరీ ప్రైవేట్‌ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. స్కూల్‌ యాజమాన్యం విద్యార్థుల రాకపోకల కోసం బస్సును ఏర్పాటు చేసింది. రోజూ ఉదయం ఎనిమిది గంటలకు ఎన్‌.హనుమాపురానికి బస్సు వచ్చి విద్యార్థులను ఎక్కించుకొని స్కూల్‌కు వెళ్తోంది.

అయితే శుక్రవారం కురుబ లాలుమోహన్‌ స్కూల్‌కెళ్లనని మొండికేశాడు. తల్లి బతిమాలి.. బస్టాప్‌ వరకెళ్లి కొడుకును బస్సు ఎక్కించింది. బస్సు ఊరు దాటి వేగంగా వెళ్తున్న సమయంలో లాలుమోహన్‌ బస్సు డోర్‌ తీసేసి ఒక్కసారిగా కిందకు దూకాడు. ఇది గమనించని డ్రైవర్‌ ముందుకెళ్లాడు. తోటి విద్యార్థులు గమనించి డ్రైవర్‌కు విషయం తెలపడంతో వెంటనే బస్సును వెనక్కు తీసుకెళ్లాడు. బస్సులోంచి విద్యార్థి కిందకు దూకిన విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారమందించారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. లాలుమోహన్‌ చెవిలోంచి రక్తం కారుతండటంతో పాటు తలకు బలమైన దెబ్బ తగలడంతో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి పంపించారు.
 
స్కూల్‌ యాజమాన్యంపై మండిపాటు  
బస్సులో నుంచి విద్యార్థి కిందకు దూకి ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండటంతో సదరు స్కూల్‌ యాజమాన్యంపై ప్రజలు మండిపడుతున్నారు. బస్సులో క్లీనర్‌ లేదా అటెండర్‌ ఎవరైనా ఉండి ఉంటే విద్యార్థి డోర్‌ తీసుకుని దూకేవాడు కాదని అన్నారు. అయితే ఒక క్లీనర్‌ / అటెండర్‌ను పెట్టడంలో స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేసే యాజమాన్యం పిల్లలకు సరైన భద్రత కల్పించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి జరిగిన ఘటనపై విచారణ నిర్వహించి బాధ్యులైన మహేశ్వరీ స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. 

వైద్య ఖర్చులు స్కూలు యాజమాన్యమే భరించాలి 
స్కూల్‌ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తమ కుమారుని వైద్యానికయ్యే ఖర్చును వారే భరించాలని విద్యార్థి తల్లిదండ్రులు కురుబ సరోజమ్మ, రాజన్నతోపాటు వైఎస్సార్‌సీపీ నాయకు లు, ఎన్‌.హనుమాపురం మాజీ సర్పంచు పైనేటి తిమ్మప్పచౌదరి డిమాండ్‌ చేశారు. ఇది ఇలా ఉండగా బాధిత విద్యార్థి బంధువులు శుక్రవారం మహేశ్వరీ స్కూల్‌ వద్దకెళ్లి జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుకు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని సహాయకునిగా ఎందుకు పెట్టలేదని వారిని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం వల్లే విద్యార్థి ప్రాణం మీదకు వచ్చిందని మండిపడ్డారు.   

మరిన్ని వార్తలు