విస్తుగొల్పే వాస్తవాలు!

13 Feb, 2018 15:27 IST|Sakshi
విజయవాడ రైల్వేస్టేషన్‌

‘అమ్మ’ కొలువైనా.. ఆమెకు లేదు రక్షణ

బెజవాడలో మహిళల భద్రత ప్రశ్నార్థకం

మహిళా మిత్ర సర్వేలో వెల్లడి

సాక్షి, అమరావతి బ్యూరో: మహిళ అర్ధరాత్రి ధైర్యంగా నడిచి వెళ్లగలిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ అన్నారు. అయితే రాష్ట్ర రాజధానిలో భాగమైన విజయవాడలో అర్ధరాత్రి కాదు కదా పట్టపగలే మహిళ ధైర్యంగా వెళ్లగలిగే పరిస్థితి లేదు. నగరంలో ఈవ్‌టీజర్లు, రౌడీలు చెలరేగిపోతున్నారు. నగరంలో ప్రధాన ప్రాంతాల్లోనూ మహిళలు ఒంటరిగా సంచరించే పరిస్థితుల్లేవని ఓ మహిళా మిత్ర సభ్యులే తేల్చిచెప్పడం గమనార్హం. వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ‘క్లాప్‌’ కార్యక్రమంలో నిర్వహించిన సర్వేలో వెల్లడైన విస్తుగొల్పే విషయాలు రాజధానిలో మహిళల దుస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి.  

ఇదీ ‘క్లాప్‌’
అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం సహకారంతో విజయవాడలోని వాసవ్య మహిళా మండలి ‘క్లాప్‌’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. విజయవాడ పోలీస్‌ కమిషరేట్‌లో అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోని మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘మహిళా మిత్ర’ సభ్యులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో భాగంగా మొదటి దశలో విజయవాడలో గవర్నర్‌పేట, సూర్యారావుపేట, మాచవరం, సత్యనారాయణపురం, సింగ్‌నగర్, నున్న పోలీస్‌స్టేషన్ల పరిధిలో మహిళా మిత్ర సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా ఈ పోలీస్‌స్టేషన్ల పరిధిలో మహిళల భద్రతపై మహిళా మిత్ర సభ్యుల అభిప్రాయం తెలుసుకోవాలని సర్వే నిర్వహించారు.

నగర శివార్లలో అధ్వానం
విజయవాడ నడిబొడ్డున ఉన్న ప్రదేశాల్లోనే మహిళలకు రక్షణ కరువైందని సర్వేలో తేటతెల్లమైంది. మరీ ఎక్కువగా నగర శివార్లులోని పోలీస్‌స్టేషన్ల పరిధిలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందని పోలీసువర్గాలే చెబుతున్నాయి. శివారు ప్రాంతాల్లోనే కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. రౌడీ గ్యాంగ్‌లు, పోకిరీలు నగరంలో ఎక్కడపడితే అక్కడ ఈవ్‌టీజింగ్, వేధింపులకు పాల్పడుతున్నారు. విజయవాడ పోలీసుల అధికారిక లెక్కల ప్రకారమే గతేడాది 2,500 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

సర్వే ఇలా..
ఆరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 40 ముఖ్య ప్రదేశాలను ఎంపిక చేశారు. ఈ ప్రదేశాల పేర్లతో ప్రశ్నావళిని రూపొందించి మహిళా మిత్ర సభ్యులకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అవి.. ఎలాంటి అనుమతి లేకుండానే వెళ్లగలం, కుటుంబసభ్యుల అనుమతి తీసుకుంటేనే వెళ్లగలం, ఒక్కరమే వెళ్లలేం, అసలు వెళ్లలేం. ఈ నాలుగు ఆప్షన్లల్లో ఏవి ఆ 40 ప్రదేశాలకు సరిపోతాయని మహిళా మిత్ర సభ్యులను ప్రశ్నించారు. అందుకు వారు ఇచ్చిన సమాధానాలు విజయవాడలో మహిళలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను తెలిపాయి. ఆ 40 ప్రదేశాల్లో 27 మహిళలకు సురక్షితమైనవి కావని సమాధానమిచ్చారు. కేవలం 13 ప్రదేశాలకు మాత్రమే కుటుంబసభ్యుల అనుమతి లేకుండా ధైర్యంగా వెళ్లగలమన్నారు.

ఇంకో 13 ప్రదేశాలకు వెళ్లాలంటే ముందుగా కుటుంబసభ్యుల అనుమతి తీసుకోవాల్సిందేనని చెప్పారు. వీటిలో కంట్రోల్‌ రూమ్, నెహ్రూ బస్టాండ్, రాజీవ్‌గాంధీ పార్క్, కాళీమాత ఆలయం, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం మొదలైన ప్రదేశాలు ఉండటం గమనార్హం. ఈ ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని స్పష్టం చేశారు. మరో 13 ప్రదేశాలకు కుటుంబ సభ్యులు, స్నేహితులు తోడు లేకుండా వెళ్లలేమని వెల్లడించారు. వాటిలో పాత ప్రభుత్వ ఆస్పత్రి రోడ్డు, లెనిన్‌ సెంటర్, సింగ్‌నగర్‌ బ్రిడ్జ్, టైమ్‌ ఆస్పత్రి రోడ్, అలంకార్‌ థియేటర్, సదర్న్‌ హోటల్‌ రోడ్డు, రమేశ్‌ ఆస్పతి రోడ్డు మొదలైనవి ఉండటం గమనార్హం. ఈ ప్రదేశాలకు ఒంటరి మహిళలు వెళ్తే ఈవ్‌టీజింగ్, వేధింపుల బారిన పడాల్సిందేనని తేల్చిచెప్పారు. ఒక ప్రదేశానికి తోడు ఉన్నాసరే వెళ్లలేమని పేర్కొన్నారు.

సర్వేకి ఎంపిక చేసిన ప్రదేశాలు 40
సురక్షితం కానివి 27

మరిన్ని వార్తలు