ఈవ్‌టీజింగ్‌పై ఉక్కుపాదం

12 Jun, 2018 09:30 IST|Sakshi
విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

మఫ్టీలో మహిళా రక్షక్‌ బృందాల     పర్యవేక్షణ

కళాశాలలు, పార్కులు, బస్టాండ్‌ ప్రాంతాల్లో నిఘా

అమ్మాయిలతో అసభ్యంగా         ప్రవర్తిస్తే కటకటాలపాలే

ఈవ్‌టీజింగ్‌ రక్కసిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కోటి ఆశలతో ఉన్నత చదువుల కోసం విద్యార్థినులు కళాశాల బాట పడుతున్నారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో ఈవ్‌టీజింగ్‌ చేయడం, ప్రేమించాలని వేధించడం చేస్తూ పోలీసులకు పట్టుబడితే ఊచలు లెక్కబెట్టాల్సిందే.  

అనంతపురం సెంట్రల్‌: మహానగరాల్లోనే కాకుండా అనంతపురం జిల్లాలో కూడా ఈవ్‌టీజింగ్‌ రక్కసి కొనసాగుతోంది. పలు కళాశాలల్లో ఈవ్‌టీజింగ్‌ దెబ్బకు చదువులు మానేసిన పిల్లలు కోకొల్లలుగా ఉంటే.. ప్రాణాలు తీసుకున్న వారు కూడా లేకపోలేదు. ముఖ్యంగా అమ్మాయిల చదువులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి సారంచిన పోలీసులు గతేడాది నవంబర్‌ నుంచి ప్రత్యేకంగా మహిళా రక్షక్‌ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా పది సబ్‌డివిజన్‌ కేంద్రాల్లో ఈ మహిళా రక్షక్‌ బృందాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలకు వేధింపుల నుంచి రక్షణ  కల్పించడమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలు, దేవాలయాలు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, పార్కులు, సినిమా థియేటర్లు తదితర ప్రాంతాల్లో మఫ్టీలో ఉంటూ నిఘా వేస్తున్నారు.

ప్రత్యేక హెల్ప్‌లైన్‌: మఫ్టీలో ఉండడమే కాకుండా ఆపదలో ఉన్న మహిళలు, విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. డయల్‌ 100, 9989819191 వాట్సాప్‌ నంబర్లను ఆశ్రయిస్తే తక్షణ సాయం అందేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 720 మంది పోకిరీలు పట్టుబడ్డారు. వీరిని వెంటనే ఆయా పోలీస్‌స్టేషన్‌లకు తరలిస్తారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పోలీసుకార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా గ్రీవెన్‌ సెల్‌ కార్యాలయంలో పోకిరీలకు వారి తల్లిదండ్రుల సమక్షంలో న్యాయవాదులు, మహిళా పోలీసులు, ఎన్‌జీఓలతో కూడిన బృందం ద్వారా పోలీసులు కౌన్సెలింగ్‌ ఇస్తారు. కౌన్సెలింగ్‌ ద్వారా పద్ధతి మార్చుకోని వారు, నేర తీవ్రత ఎక్కువ ఉన్న వారిపై కేసులు కూడా నమోదు చేస్తుండడం గమనార్హం. ఇప్పటి వరకూ 17 మందిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, 10 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.  నగరంలో కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలల్లో పదవతరగతి చదువుతున్న విద్యార్థినిని వేధిస్తున్న పోకిరీపై గతంలో నేరచరిత్ర ఉండడంతో రౌడీషీట్‌ ఓపెన్‌ చేయడం గమనార్హం.   

ఉపేక్షించేది లేదు
ఈవిటీజింగ్‌ను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదు. ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ప్రత్యేకంగా మహిళా రక్షక్‌ బృందాలు నియమించాం. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ పట్టుబడితే జైలుపాలు కావాల్సిందే. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. అనంతపురం సబ్‌డివిజన్‌ పరిధిలోనే అనేక మందిపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేశాం.  – వెంకట్రావ్, డీఎస్పీ, అనంతపురం   

మరిన్ని వార్తలు