చినుకు పడితే కొంప కొల్లేరే!

19 Dec, 2018 11:02 IST|Sakshi

రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో అధ్వానంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ 

చిన్నపాటి వర్షం కురిసినా అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్తం 

విజయవాడ, గుంటూరు, నెల్లూరు, విశాఖలో ముందుకు సాగని మురుగునీటి పారుదల పనులు

పనులు చేయని నిర్మాణ సంస్థలపై చర్యలు శూన్యం  ∙ప్రజలు అవస్తలు పడుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షానికే ప్రధాన నగరాల్లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై రెండు, మూడు అడుగుల మేరకు వర్షం నీరు పొంగి ప్రవహిస్తుండటంతో జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. భూగర్భ మురుగు నీటి కాల్వలు లేకపోవడమే ఈ దుస్థితి కారణం. డ్రైనేజీల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వర్షాలు కురుస్తున్నాయంటే చాలు నగరాలు, పట్టణాల్లో ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  

నిత్య నరకం  
గుంటూరులో భూగర్భ మురుగు నీటిపారుదల పనులు స్థానికులకు నిత్యం నరకం చూపిస్తున్నాయి. నగరంలో రూ.960 కోట్ల విలువైన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. 2016లో ఈ పనులను ప్రారంభించింది. 526 కిలోమీటర్ల మేర మురుగునీటి కాల్వల నిర్మాణాలు, 47,000 మ్యాన్‌హోల్స్, 84,000  ఇన్‌స్పెక్షన్‌ ఛాంబర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, నిర్మాణ సంస్థ ఇప్పటివరకు కేవలం 186 కిలోమీటర్ల నిడివిలోనే మురుగునీటి కాల్వల నిర్మాణాలు పూర్తి చేసింది. 21,000 మ్యాన్‌హోల్స్‌ను నిర్మించింది. పనులు అరకొరగానే జరగడంతో వర్షం వస్తే నగరం అతలాకుతలమవుతోంది. ప్రజల నుంచి ఎన్ని ఫిర్యాదులు అందినా నిర్మాణ సంస్థపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. వారానికోసారి జిల్లా అధికారులు సమీక్ష జరుపుతున్నా గుంటూరులో డ్రైనేజీ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.  
 
నెల్లూరులో సొంత ఇళ్లకు తాళాలు  
నెల్లూరు నగరంలో రూ.1,077 కోట్లతో మురుగునీటి పారుదల వ్యవస్థ పనులను ప్రభుత్వం చేపట్టింది. 2016లో మొదలైన ఈ పనులు 2018 డిసెంబరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. పనుల విషయంలో నిర్మాణ సంస్థ ఆలస్యం చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూగర్భ మురుగు కాలువులు లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. ఈ బాధలు భరించలేక నెల్లూరు కొందరు సొంత ఇళ్ల తాళాలు వేసి ఇతర ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నంలో జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద రూ.1,289 కోట్లతో జరుగుతున్న భూగర్భ మురుగునీటి పారుదల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.   

సమన్వయ లోపమే శాపం  
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నంలో భూగర్భ మురుగునీటి పారుదల పనులకు నిధులు కేటాయించింది. విజయవాడలో ప్రస్తుతం 83 కిలోమీటర్ల మేర మేజర్‌ డ్రెయిన్లు, 258 కిలోమీటర్ల మేర మీడియం, 982 కిలోమీటర్ల మేర మైనర్‌ డ్రెయిన్లు ఉన్నాయి. వీటిని 12 నుంచి 18 అడుగుల వెడల్పుతో నిర్మించారు. నగరంలో పెరుగుతున్న జనాభా, పూడిపోయిన డ్రెయిన్లను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం రూ.464 కోట్లతో స్ట్రామ్‌వాటర్‌ డ్రైనేజీ పనులకు టెండర్లను ఆహ్వానించింది. 2016లో ఈ పనులను ఎల్‌అండ్‌టీ సంస్థ దక్కించుకుంది. విజయవాడలో 424 కిలోమీటర్ల నిడివిలో డ్రెయిన్లు నిర్మించేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రెండేళ్ల క్రితం పనులు ప్రారంభమ్యాయి. ఇప్పటిదాకా కేవలం 4 కిలోమీటర్ల మురుగునీటి కాల్వల నిర్మాణాలు జరిగాయి. మరో 36 కిలోమీటర్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మున్సిపల్, ప్రజారోగ్యశాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.  

మరిన్ని వార్తలు