అధికారం మార్పు వైపే మొగ్గు

13 Mar, 2019 13:57 IST|Sakshi

సాక్షి, ఆరిలోవ: సార్వత్రిక ఎన్నికలకు తేదీ ప్రకటించడంతో తూర్పు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కుతోంది. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొననుంది. ఇక్కడ ఇప్పటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలతో పాటు జనసేన–వామపక్షాల కూటమి బరిలోకి దిగనున్నాయి. అయితే ఇందులో ప్రధాన పోటీ వైఎస్సార్‌సీపీ– టీడీపీల మధ్యే జరగనుందని భావిస్తున్నారు. ఇందులో అధికార బలంతో టీడీపీ బరిలోకి దిగనుండగా.. ప్రజాబలంతో వైఎస్సార్‌సీపీ పోటీకి నిలుస్తుంది. ఇక నియోజకవర్గంలో సుమారు 50 శాతం ఉన్న యాదవ, కాపు సామాజిక వర్గాల ప్రాధాన్యం ఎక్కువే. ఈ రెండు సామాజిక వర్గాల పైనే గెలుపు, ఓటములు ఆధారపడి ఉన్నాయి.
 
రెండు ఎన్నికలతో పోలిస్తే .. సీన్‌ రివర్స్‌
ప్రస్తుతం ఇక్కడ టీడీపీకి చెందిన వెలగపూడి రామకృష్ణబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ప్రజా రాజ్యం తరపున, 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన సీహెచ్‌.వంశీకృష్ణ శ్రీనివాస్‌పై విజయం సాధిం చారు. అయితే నియోజకవర్గంలో 2014లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. సీన్‌  మారిపోయింది. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతోంది. అదే తరుణంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ప్రజా సంక్షేమ ప«థకాలైన నవరత్నాల వైపు ఇక్కడి వారు మొగ్గు చూపుతున్నారు.  

అధికార పార్టీ బలం .. బలహీనతలు
వెలగపూడి రామకృష్ణబాబుకు అధికారపార్టీ ఇప్పటికే టిక్కెట్‌ కేటాయించింది. అభివృద్ధి పనులు జరిగిన కొద్ది ప్రాంతాల్లో ప్రజల మద్దతుతో పాటు పార్టీ క్యాడర్‌ ఆ పార్టీకి కలసివచ్చే అంశం. జన్మభూమి కమిటీలకు పెత్తనం ఇవ్వడంతో కార్యకర్తలకు మేలు జరిగి, వారు ఈసారి కూడా వెలగపూడి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే జన్మభూమి కమిటీలపై ప్రజల్లో వ్యతిరేకత వారికి ప్రతికూల అంశం కానుంది.  ఇంకా .. పార్టీలో కీలక నాయకుల మధ్య అంతర్గత కలహాలున్నాయి. 2009లో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ ఇద్దరు మాజీ కార్పొరేటర్లు.. ఎమ్మెల్యే ఇప్పటికీ ఎడముఖం, పెడముఖంగానే ఉన్నారు. 

వెలగపూడి దురుసు స్వభావంపై వ్యతిరేకత
వెలగపూడి దురుసు స్వభావంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రెండేళ్లుగా ఆయన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వార్డుల్లో పర్యటించినప్పుడు సమస్యలు చెప్పడానికి వచ్చిన ప్రజలపై విరుచుకుపడతారనే భావన బాగా నాటుకుపోయింది. ఇందుకు ఇవే నిదర్శనాలు..  2017 డిసెంబరులో ఒకటోవార్డు లక్ష్మీనగర్‌లో రోడ్ల శంకుస్థాపనకు వచ్చిన ఆయనకు సమస్యలు చెప్పుడుకోవడానికి వెళ్లిన ఓ స్థానికుడిని దుర్భాషలాడారు. 
- అదే ఏడాది కొండవాలులో తాగునీటి కోసం అడిగిన మహిళలపై కన్నెర్రజేశారు.  గతేడాది మూడోవార్డు రవీంద్రనగర్‌లో సెల్‌ టవర్‌ ఏర్పాటు చేయొద్దంటూ అడిగిన ఓ మహిళపై చేతిలో ఉన్న మైక్‌ విసిరేసి విరుచుకుపడ్డారు. ఇదే మాదిరిగా జోడుగుళ్లపాలెం, పెదవాల్తేరు, మద్దిలపాలెం ప్రాంతాల్లో పలుచోట్ల ప్రజలపై ఆయన దురుసుగా ప్రవర్తించిన సంఘటనలున్నాయి. 
- ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు తన చాంబరులో గన్‌మన్‌పై చేయిచేసుకొన్న సంఘటన అప్పట్లో పెద్ద దుమారం రేపింది.

వైఎస్సార్‌సీపీ బలాలివీ..
వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజలతో మమేకమవుతూ వారికి బాగా చేరువయ్యారు.  తమ పార్టీ అధినేత వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను పార్టీ సమన్వయకర్త సీహెచ్‌.వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎంవీవీ సత్యనారాయణ పార్టీలో చేరి సేవా కార్యక్రమాలు చేపట్టడం, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నియోజకవర్గమంతా తిరిగి ప్రజలతో మమేకం కావడంతో పార్టీకి నూతనోత్తేజం లభించింది.

దీంతో పాటు వంశీకృష్ణ శ్రీనివాస్‌ ప్రజలకు తాగునీరు సరఫరా చేయడం, పేదలకు ఆర్థిక సహకారం అందించడం వంటి కార్యక్రమాలను నిర్వహించడంతో ప్రజల్లో నమ్మకం కలిగింది. గత రెండుసార్లు ఓటమిపాలవడంతో స్థానికుల్లో వంశీకృష్ణపై సానుభూతి కూడా ఉంది. దీంతో పాటు ఇటీవల పలువురు ఇతర పార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఈ సారి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇక యాదవ, కాపు సామాజికవర్గాల నుంచి అధిక శాతం మద్దతు వైఎస్సీర్‌సీపీకి ఉండటమూ ఆ పార్టీ విజయానికి కలసివచ్చే అంశాలు.  

మరిన్ని వార్తలు