రూ.1,000 కోట్ల కమీషన్లకు ముఖ్యనేత ‘టెండర్‌’

16 Feb, 2019 05:42 IST|Sakshi

రాజోలిబండ కుడి కాలువ, వేదవతి,చిత్రావతి–హంద్రీ–నీవా రెండో దశ,మేర్లపాక–మల్లెమడుగు ఎత్తిపోతల టెండర్లలో గోల్‌మాల్‌ 

కోటరీలోని బడా కాంట్రాక్టర్లకే టెండర్లు దక్కేలా ‘ముఖ్య’నేత వ్యూహం 

తద్వారా వెయ్యికోట్లకు పైగా కమీషన్లు దండుకోవడానికి ప్రణాళిక 

ఈ మొత్తాన్ని వచ్చే ఎన్నికల్లో వెదజల్లి ఓట్లు కొనుగోలు చేయడమే లక్ష్యం 

నాలుగు ప్రాజెక్టులకు రూ.4,515.61 కోట్ల అంచనా వ్యయంతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ 

సాక్షి, అమరావతి: కంచె.. చేను మేస్తోంది. ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్తగా వ్యవహరించాల్సినవారే దొరికినంత దోచుకుంటున్నారు. రాయలసీమలో తాజాగా చేపట్టిన నాలుగు ప్రాజెక్టుల టెండర్లే అందుకు నిదర్శనం. కోటరీ కాంట్రాక్టర్లతో ముఖ్యనేత బేరసారాలు జరిపారు.. కమీషన్ల లెక్క తేలడంతో వారికి తలా ఒక ప్రాజెక్టు కేటాయించారు. రూ.4,515.61 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు ప్రాజెక్టులకు సోమవారం వేర్వేరుగా టెండర్‌ నోటిఫికేషన్‌లు జారీ చేయించారు. ఈ క్రమంలో అధికారుల ప్రతిపాదనలను బుట్టదాఖలు చేశారు. టెండర్లను పారదర్శకంగా నిర్వహిస్తే కనీసం పది శాతం తక్కువ ధరలకు కాంట్రాక్టర్లు కోట్‌ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖజానాకు రూ.474.24 కోట్ల మేర మిగిలేది. ముఖ్యనేత కాంట్రాక్టర్లను కుమ్మక్కయ్యేలా చేయడంతో సగటున 4.99 శాతం అధిక ధరలకు కోట్‌ చేస్తూ దాఖలు చేసే షెడ్యూళ్లను ఎల్‌–1గా తేల్చి టెండర్లు ఖరారు చేయనున్నారు. దీని వల్ల ఖజానాకు రూ.272 కోట్ల మేర నష్టం వాటిల్లుతుంది. అంచనా వ్యయ ప్రతిపాదనల్లోనే అక్రమాలకు పాల్పడటం వల్ల వ్యయాన్ని సుమారుగా రూ.1,000 కోట్లకుపైగా పెంచేసి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు. టెండర్లను ఖరారు చేశాక కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చేసి రూ.వెయ్యి కోట్లకుపైగా ముడుపులు వసూలు చేసుకుని ఎన్నికల్లో వెదజల్లడానికి స్కెచ్‌ వేశారు. వివరాల్లోకి వెళితే..  ఆర్డీఎస్‌ కుడి కాలువతోపాటు వేదవతి ఎత్తిపోతల, గాలేరు–నగరి రెండో దశ, హంద్రీ–నీవా రెండో దశలో మిగిలిపోయిన పనులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని 2014లో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇన్నేళ్లపాటు వాటిని పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టులకు పరిపాలన అనుమతి ఇస్తూ గత నెల 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఆర్డీఎస్‌కు మినహా మిగిలిన ప్రాజెక్టులకు హైడ్రాలాజికల్‌ క్లియరెన్స్‌ లేదు. సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పక్కన పెట్టేసి.. ఉజ్జాయింపుగా అంచనాలు వేసి.. వాటి ఆధారంగానే టెండర్లు పిలవాలంటూ అధికారులపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. 

అక్రమాలకు నిదర్శనాలివే.. 
- ఆర్డీఎస్‌ కుడి కాలువ (ఆర్డీఎస్‌ ఆనకట్ట ఎగువన కోసిగి మండలం బాత్రబొమ్మలాపురం నుంచి ఉల్చాల వరకూ 162.849 కి.మీ.ల మేర కాలువ తవ్వాలి. నాలుగు రిజర్వాయర్లు, నాలుగు దశల్లో నీటిని ఎత్తిపోయడం ద్వారా 40 వేల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులు చేయాలి) పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని కర్నూలు జిల్లా అధికారులు ప్రతిపాదించారు. కానీ వాటిని తోసిపుచ్చిన సర్కార్‌ రూ.1,557.37 కోట్లతో ఒకే ప్యాకేజీ కింద ఆ పనులను ఎల్‌ఎస్‌ (లంప్సమ్‌ ఓపెన్‌) విధానంలో 30 నెలల్లో పూర్తి చేయాలనే గడువు పెట్టి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.  
వేదవతి ఎత్తిపోతల పథకం (వేదవతి నుంచి 4.20 టీఎంసీలను మూడు దశల్లో ఎత్తిపోసి 2.029 టీఎంసీల సామర్థ్యంతో హాలహర్వి రిజర్వాయర్, 1.027 టీఎంసీల సామర్థ్యంతో మొలగవల్లి రిజర్వాయర్‌ను నిర్మించి 80 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా డిస్ట్రిబ్యూటరీలు చేయాలి) పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవడానికి అనుమతి ఇవ్వాలని కర్నూలు జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలను సర్కార్‌ బుట్టదాఖలు చేసింది. ఈ పనులను ఒకే ప్యాకేజీ కింద రూ.1,536.28 కోట్ల అంచనా వ్యయంతో, ఎల్‌ఎస్‌–ఓపెన్‌ విధానంలో 30 నెలల్లో పూర్తి చేయాలనే గడువుతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ – యోగి వేమన రిజర్వాయర్‌– హంద్రీ–నీవా రెండో దశ ఎత్తిపోతల పథకం (చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని ఎత్తిపోసి అనంతపురం జిల్లాలోని యోగి వేమన రిజర్వాయర్‌కు జలాలను తరలించి 12,880 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు.. యోగి వేమన రిజర్వాయర్‌ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం రెండో దశకు కాలువలోకి నీటిని ఎత్తిపోయడం) పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడానికి అనుమతి ఇవ్వాలని అనంతపురం జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలను సర్కార్‌ తుంగలో తొక్కింది. ఈ పనులను ఒకే ప్యాకేజీ కింద రూ.1,182.35 కోట్ల వ్యయంతో, ఎల్‌ఎస్‌–ఓపెన్‌ విధానంలో 24 నెలల్లో పూర్తి చేయాలనే గడువు పెట్టి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
మేర్లపాక చెరువు నుంచి–మల్లెమడుగు రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే పనులకు రూ.239.61 కోట్లతో ఎల్‌ఎస్‌–ఓపెన్‌ విధానంలో 12 నెలల్లో పూర్తి చేయాలనే నిబంధన పెట్టి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
అధికారులు సూచించినట్టు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి ఉంటే.. ఎక్కువ మంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం ఉండేది. అప్పుడు తక్కువ ధరలకే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించే అవకాశం ఉండేది. కానీ.. సర్కార్‌ ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలవడంతో కోటరీలోని నలుగురు బడా కాంట్రాక్టర్లు మాత్రమే ఈ పనులు చేయడానికి అర్హత సాధిస్తారు. ఆ మేరకే నిబంధనలు పెట్టారు.  

ఎన్నికలకు ఇం‘ధనం’ కోసమే.. 
నాలుగు ప్రాజెక్టులకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన సర్కార్‌.. ఇందులో చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ – యోగివేమన రిజర్వాయర్‌–హంద్రీ–నీవా రెండో దశ ఎత్తిపోతల మినహా మిగిలిన 3 ప్రాజెక్టుల టెండర్లలో షెడ్యూలు దాఖలు చేయడానికి 18న తుది గడువుగా విధించింది. 19న టెక్నికల్‌ బిడ్‌.. 21న ప్రైస్‌ బిడ్‌ ఖరారు చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటానికి ముందు 4 ప్రాజెక్టుల పనులను చేపట్టడానికి కారణం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగించి రూ.1,000 కోట్లు కమీషన్లు దండుకుని వాటినే ఎన్నికల్లో వెదజల్లడమేనన్నది స్పష్టమవుతోంది.   

మరిన్ని వార్తలు