మందుబాబుల బడి

13 Jul, 2019 11:46 IST|Sakshi
 పాఠశాలలోని ట్యాంకు కింద పడేసిన మద్యం బాటిళ్లు, గ్లాసులు.. పాఠశాలకు ఆనుకొని ఉన్న బెల్టు షాపు, పాఠశాలలోని ఒక రూములో మందు సీసాలు 

పాఠశాలకు ఆనుకుని 4 బెల్టుషాపులు 

సాయంత్రం నుంచి జోరుగా మద్యం విక్రయాలు 

తాగి.. మత్తులో సీసాలు పగులగొట్టి.. వికృత చేష్టలు 

పోలీసులకు, ఎక్సైజ్‌ అధికారులకు తెలిసినా నిష్ప్రయోజనం 

బెల్టుషాపుల నిర్మూలించాలన్న సీఎం ఆదేశాలూ బేఖాతరు

అది ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులు చదువుకునే బడి. సాయంత్రం ఐదు దాటితే విద్యాలయ ప్రాంగణం మందుబాబులకు అడ్డా. బడికి ఆనుకుని ఉన్న బెల్టుషాపుల్లో మద్యం కొనుగోలు చేసి తరగతి గదులను సిట్టింగ్‌ రూములకు మార్చేసుకుంటున్నారు. పీకల దాకా తాగి మత్తులో ఊగుతూ సీసాలను పగులగొట్టి ఇష్టమొచ్చినట్లు విసురుతున్నారు. ఉదయాన్నే బడికి చేరుకున్న పిల్లలు పగిలిన గాజుపెంకులు గుచ్చుకుని రక్తమోడుతూ బాధతో విలవిలలాడుతున్నారు.  

సాక్షి, హిందూపురం సెంట్రల్‌: హిందూపురం మండలం మనేసముద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత టీడీపీ పాలనలో కొందరు నాయకుల అండదండలతో గ్రామంలో బెల్టుషాపులు వెలిశాయి. ప్రాథమికోన్నత పాఠశాలకు ఆనుకుని ఒకటి.. దాని సమీపంలో మరొకటి.. ఇలా నాలుగు ఏర్పాటు చేశారు. ఐదేళ్లూ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తూ వచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక బెల్టుషాపులు సమూలంగా నిర్మూలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అప్పటి వరకు నిరాటంకంగా కొనసాగిస్తూ వచ్చిన బెల్టుషాపులను అధికారులు మూసివేయించాల్సి ఉంది. అయితే బెల్టుషాపుల నిర్వాహకులకు టీడీపీ నాయకులతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ అండదండలు ఉన్నాయన్న కారణంతో అధికారులెవరూ పట్టించుకోలేదు.  

బడి ముగియగానే మందు శాల.. 
బడి వేళలు ముగియగానే సాయంత్రం నుంచి బెల్టుషాపులు తెరుచుకుంటాయి. అప్పటి వరకు ఇళ్లల్లో ఉంచుకున్న మద్యాన్ని నిర్వాహకులు బెల్టుషాపుల్లోకి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ మందు కొనుగోలు చేసిన బాబులు నేరుగా ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలోకి వెళ్తున్నారు. అక్కడి తరగతి గదిని ఏకంగా సిట్టింగ్‌ రూమ్‌గా మార్చుకున్నారు. అక్కడే పూటుగా తాగి తందనాలు ఆడుతున్నారు. అంతటితో ఆగకుండా మద్యం సీసాలను పగులగొడుతున్నారు. గాజు పెంకులు తరగతి గదులు.. ఆవరణల్లోనే ఎగిరిపడుతున్నాయి.  

పాఠశాలలో ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంకు కింద మందు సీసాలు, గ్లాసులు, గాజు పెంకు గుచ్చుకోవడంతో కాలికి గాయమైందని చెబుతున్న విద్యార్థిని    

పసి మొగ్గలకు రక్తగాయాలు 
పాఠశాలకు చేరుకున్న పిల్లలు ఏమాత్రం అజాగ్రత్తగ ఉన్నా ప్రమాదాలకు గురవుతున్నారు. పాదరక్షలు లేకుండా గదిలోంచి బయటకు వస్తే గాజు పెంకులు గుచ్చుకుని విలవిలలాడుతున్నారు. పాఠశాల ఆవరణంలోనే మందుబాబుల సీసాలతో పాటు ప్లాస్టిక్‌ గ్లాసులు పడేస్తున్నారు. పాఠశాల ఆవరణలో ఉదయాన్నే శుభ్రం చేస్తున్నప్పటికీ సాయంత్రం మళ్లీ పగిలిన సీసాలు దర్శనమిస్తున్నాయి. బడి ఆవరణలో జరిగే అసాంఘిక కార్యకలాపాల గురించి ఉపాధ్యాయులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎటువంటి ప్రయోజనమూ కనిపించలేదు.
 
సీఎం ఆదేశాలు బేఖాతరు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెల్టుషాపులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా మనేసముద్రంలో బేఖాతరు చేస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ అదికారులు, తహసీల్దార్‌ అక్కడ బెల్టు షాపులను ఎత్తివేయించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పాఠశాలలో ఉన్న పాత భవనాలు, క్రీడా ప్రాంగణం మొత్తం వేలాది మద్యం సీసాలతో దర్శనమిస్తున్నాయి. బెల్టుషాపులపై పలుమార్లు అదికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తెలిపారు. ఎవరైనా ఎదురు తిరిగితే దాడులకు తెగబడుతున్నారన్నారు.  

ఫిర్యాదు చేసి అలసిపోయాం 
బెల్టుషాపులు తీసేయాలని పలుమార్లు విన్నవించుకున్నా వారు తొలగించుకోలేదు. ఇది పాఠశాలలాగా కాకుండా ఒక బారులా కనిపిస్తోంది. ఎంతని శుభ్రం చేయించగలం. ఎంత చేసినా రోజూ వందలకొద్దీ మందుబాటిళ్లు ఇక్కడ పడేస్తున్నారు. భయమేస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. విద్యార్థులకు, మాకు గాజు పెంకులు కాళ్లకు గుచ్చుకుంటూనే ఉన్నాయి. ప్రథమ చికిత్స కోసం ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ను అందుబాటులో ఉంచుకున్నాం. 
– జయమ్మ, హెచ్‌ఎం, ప్రాథమికోన్నత పాఠశాల

వాటికి అనుమతుల్లేవు 
మనేసముద్రంలోని బెల్టుషాపులకు అనుమతులు లేవు. రెండేళ్లుగా వారు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేశాం. ఫైన్‌లు వేశాం. వారిపై బైండోవర్లు కూడా ఉన్నాయి. మేము చాలా ప్రయత్నాలు చేశాం. తహసీల్దార్,  ఎంపీడీఓల దృష్టికి తీసుకెళ్లాం. వారు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. అక్కడ బెల్టుషాపులు నిర్వహిస్తున్నది మహిళలు. ఇక ఉపేక్షించబోము. విద్యార్థులున్న చోట అలాంటి కార్యకలాపాలకు చోటు కల్పించడం తీవ్ర నేరం. చర్యలు చేపడతాం. 
– ప్రతాప్‌రెడ్డి, ఎక్సైజ్‌ సీఐ, హిందూపురం 

 

మరిన్ని వార్తలు