ఆగని మృత్యు కేళి

1 Apr, 2016 01:58 IST|Sakshi
ఆగని మృత్యు కేళి

మజ్జివలస హాస్టల్‌లో గిరిజన విద్యార్థి మృతి
రెండు నెలల వ్యవధిలో  ఏడుగురు మృత్యువాత
మార్చురీ వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన
గిరిజన సంక్షేమ డీడీ కమల
లిఖితపూర్వక హామీతో ఆందోళన విరమణ

 
 
 పాడేరు రూరల్:
  మన్యంలోని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల మరణాలు ఆగడం లేదు.    మన్యం వసతి గృహాల్లో ఉండి చదువుకుం టున్న ఏడుగురు  విద్యార్థులు రెండు నెలల వ్యవధిలో అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. విద్యార్థులు పిట్టల్లారాలిపోతున్నా ఐటీడీఏ, గిరిజన సంక్షేమ అధికారులు  మరణాల అడ్డుకట్టకు సరైన చర్యలు తీసుకోవడం లేదని  విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన, ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

 తాజాగా హుకుంపేట మండలం మారుమూల బూరుగుపుట్టు పంచాయతీ మజ్జివలస గిరిజన సంక్షేమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న కొర్రా శంకరరావు అనే విద్యార్థి మృతి చెందాడు. అదే పాఠశాలలో చదువుతున్న శంకరరావు సోదరుడు కొర్రా నవీన్‌కుమార్, తోటి విద్యార్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొర్రా శంకరరావు బుధవారం రాత్రి భోజనం తర్వాత అందరి విద్యార్థులతో హాస్టల్‌లో పడుకున్నాడు. తెల్లవారు జాము 4.30 గంటలకు ఉన్నట్టుండి కడుపునొప్పి, రక్తంతో కూడిన వాంతులు అవడం మొదలైంది. పక్కనే నిద్రపోతున్న విద్యార్థులు   గమనించి హాస్టల్ క్వార్టర్స్‌లో ఉంటున్న సీఆర్‌టీలకు సమాచారం అందజేశారు. వారు ఉదయం ఏడు గంటలకు విద్యార్థిని ఉప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.

కానీ ఆ సమయంలో ఆస్పత్రికి తాళం వేసి ఉంది. ఆస్పత్రిలో ఉండాల్సిన స్టాఫ్ నర్సుతో సహా మిగిలిన ఎవ్వరు లేరు.   చేసేదేమీ లేక ఉప్పలో ఓ ప్రైవేటు వాహనంలో పా డేరు ఆస్పత్రికి తరలిస్తుండగా   హుకుంపేట వచ్చేసరికే విద్యార్థి మృతి చెందాడు.  మృతదేహాన్ని   పోస్టుమార్టం కోసం పాడేరు ప్రాం తీయ ఆస్పత్రికి తరలించారు.

 విద్యార్థి కుటుంబ సభ్యుల ఆందోళన
తమ బిడ్డ మృతి చెందిన విషయం తెలుసుకున్న  కుటుంబ సభ్యులు, వైఎస్‌ఆర్ సీపీ  విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి తడబారికి సురేష్‌కుమార్, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శులు ఎం.ఎం.శ్రీను, కె.సుందర్‌రావులు ఆస్పత్రికి చేరుకున్నారు. శంకరారవు కుటుంబాన్ని ఆదుకోవాలని,  మృతిపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల డిప్యూటీ వార్డెన్, హెచ్‌ఎం, ఏటీడబ్ల్యూఓలపై కఠిన చర్యలు తీసుకోవాలని  నినాదాలు చేశారు.  న్యాయం జరిగకపోతే అక్కడి నుంచి కదిలేది లేదబి బీష్మించుకుని కూర్చున్నారు.
 
 డీడీ హామీతో ఆందోళన విరమణ  
గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎం.కమల ఆస్పత్రి మార్చిరీ వద్ద చేరుకుని విద్యార్థి కుటుంబ సభ్యులు, సంఘాల నాయకులతో మాట్లాడారు.   మృతిపై పూర్తి స్థాయి విచారణ చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఎక్స్‌గ్రేషియా మంజూరయ్యేటట్లు కృషి చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోస్టుమార్టం పూర్తి చేసి విద్యార్థి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు హుకుంపేట ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు