ఏపీకి ప్రత్యేక సాయం చేయండి

1 Feb, 2017 02:13 IST|Sakshi
ఏపీకి ప్రత్యేక సాయం చేయండి

రైల్వే కేటాయింపులపై కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే కేటాయింపుల్లో ఏపీకి అవసరమైన మేరకు నిధులు కేటాయించి పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వివిధ మార్గాల్లో కొత్త రైళ్లను మంజూరు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభును ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. మంగళవారం కేంద్ర మంత్రితో భేటీ అయిన సుబ్బారెడ్డి.. ఏపీకి, ఒంగోలు జిల్లాకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ఒంగోలు రైల్వే స్టేషన్‌లో రెండో టికెట్‌ బుకింగ్‌ కౌంటర్, రెండో ఎస్కలేటర్, లిఫ్ట్‌ సదు పాయం కల్పించాలని కోరారు. ఒంగోలు– సికింద్రాబాద్‌ మధ్య నడికుడి మీదుగా అమరావతిని కలుపుతూ పగలు సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపాలని కోరారు. 

ఒంగోలు స్టేషన్‌లో కేరళ, జోధ్‌పూర్, జైపూర్, పాండిచ్చేరి ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లను నిలపాలని విజ్ఞప్తి చేశారు. టంగుటూరులో తిరుమల, హైద రాబాద్, సింహపురి ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌ ఇవ్వా లని అభ్యర్థించారు. అలా గే సింగరాయకొండ స్టేషన్‌లో పద్మావతి, చార్మినార్, మచిలీపట్నం, శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లకు, దొనకొండలో హౌరా ఎక్స్‌ ప్రెస్, కురిచేడులో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌ ఇవ్వాలని కోరారు.  గుంటూరు– ముంబై రైలును నడపాలని, సికింద్రాబాద్‌–గుంటూరు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రవేశపెట్టడం, ప్రస్తుతం నడుస్తున్న సికింద్రాబాద్‌–గుంటూరు ప్యాసింజర్‌ రైలు ను ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని, మచిలీ పట్నం–యశ్వంత్‌పూర్‌ మధ్య నడుస్తున్న కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ను ప్రతిరోజూ నడపాలని, సికింద్రాబాద్‌లో రాత్రి 10.55 గంటలకు బయల్దేరే సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను రాత్రి 10 గంటలకు మార్చాలని అభ్యర్థిస్తూ వినతిప్రత్రాన్ని సమర్పించారు.

మరిన్ని వార్తలు