ప్రపంచాన్ని మార్చే శక్తి.. యువతే

20 Jan, 2015 01:19 IST|Sakshi
ప్రపంచాన్ని మార్చే శక్తి.. యువతే

నైపుణ్యం పెంచుకోండి..
యువతకు సీఎం చంద్రబాబు పిలుపు
స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభం
2,387 పోలీసు వాహనాల పంపిణీ

 
విజయవాడ : ప్రపంచాన్ని మార్చే శక్తి యువతకు ఉందని, రాష్ట్రంలోని యువతీయువకులు తమలోని నైపుణ్యతను పెంపొందించుకుని వినూత్నంగా పని          చేసేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక సిద్ధార్థ ఆడిటోరియం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విద్యార్థినీ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. మొబైల్ విప్లవం ప్రపంచాన్ని శాసిస్తోందని, అందులో గణనీయమైన ప్రగతి సాధించేందుకు యువత ముందుకు వస్తే తమ  ప్రభుత్వం కావాల్సినంత    ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే          వరకు వారికి కావాల్సిన అవసరాలపై యాప్‌లు తయారుచేయాలన్నారు. విద్యార్థులు తయారుచేసే యాప్‌లకు కావాల్సిన మార్కెటింగ్ సౌకర్యం తాను కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారని, వారిలో పట్టుదల ఎక్కువని, ఆడపిల్లలను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలని చెప్పారు. ఆడపిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో 33శాతం రిజర్వేషన్లు తాను కల్పిస్తే ఇప్పుడు 50 శాతం మంది ఆడపిల్లలే చదువుకుంటున్నారని తెలిపారు. 2050 నాటికి ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నారు. ఒకప్పుడు ఒకరిద్దరు పిల్లలతో సరిపెట్టుకోమని తాను చెప్పేవాడినని, అయితే ఇప్పుడు చైనా, జపాన్ దేశాల్లో చూస్తుంటే యువశక్తి పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 2020 నాటికి దేశంలో సరాసరి వయస్సు 29 ఏళ్లు ఉంటే, చైనా, జపాన్‌లో 40 నుంచి 50 ఏళ్లు ఉంటుందని వివరించారు.
 
కలెక్టర్‌కు అభినందన

విద్యార్థులు తయారుచేసిన యాప్‌లను సీఎం పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు తాను తయారుచేసిన ‘బీ సేఫ్’ యాప్‌ను చూపించారు. దీంతో ఆయనను అభినందించిన సీఎం.. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో కలెక్టర్ ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఇతర జిల్లాల కలెక్టర్లు కూడా దీన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. పరిపాలనలో వేగం పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలన్నీ యాప్‌ల ద్వారా తెలియజేసేలా కృషి జరగాలని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 650 మంది విద్యార్థులు తాము తయారుచేసిన యాప్‌లను 17 సెంటర్ల ద్వారా చూపించారు.
 
పోలీసు వాహనాలకు గ్రీన్‌సిగ్నల్


 పోలీసు వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రూ.100 కోట్లతో నూతనంగా కొన్న 2,387 వాహనాలను ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో చంద్రబాబు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
 
నీటిపారుదల కార్యాలయానికి వెళ్లని చంద్రబాబు
 

పోలీసు వాహనాలను ప్రారంభించిన తరువాత చంద్రబాబు నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు క్యాంపు కార్యాలయానికి వస్తారని తొలుత ప్రకటించారు. అయితే, మూడు గంటలు ఆలస్యంగా నగరానికి చేరు కోవడంతో హడావుడిగా పోలీసు వాహనాలను ప్రారంభించిన సీఎం నేరుగా సిద్ధార్థ ఆడిటోరియానికి వెళ్లిపోయారు. దీంతో చంద్రబాబును కలవడానికి అక్కడ వేచి ఉన్న టీడీపీ నేతలు నిరాశకు లోనయ్యారు. తొలుత ముఖ్యమంత్రికి స్థానిక స్టేడియం వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. పర్యటనలో ముఖ్యమంత్రి వెంట కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప, మంత్రులు పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని శ్రీనివాస్ (నాని), మేయర్ కోనేరు శ్రీధర్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, వంశీమోహన్, శ్రీరాం తాతయ్య, బోడే ప్రసాద్, తంగిరాల సౌమ్య, డీజీపీ జేవీ రాముడు, అడిషనల్ డీజీపీ (ఇంటెలిజెన్స్) అనూరాధ, అడిషనల్ డీజీపీ ఆర్పీ ఠాగూర్, ఐజీ గోపాలకృష్ణ, కలెక్టర్ బాబు.ఎ, నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ జె.మురళి తదితరులు ఉన్నారు. కార్యక్రమాలన్నీ ముగిసిన అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరిన సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు. విమానాశ్రయంలో అధికారులు, ప్రతినిధులు ఘన వీడ్కోలు పలికారు.
 

>
మరిన్ని వార్తలు