సమసమాజాన్ని నిర్మించాలి

18 Dec, 2014 03:25 IST|Sakshi

గుంటూరు ఈస్ట్ : సమసమాజ స్థాపన దిశగా యువతను తీర్చిదిద్దడానికి నెహ్రూ యువకేంద్రం కృషి చేయాలని అదనపు జేసీ వెంకటేశ్వరావు పిలుపునిచ్చారు. వసంతరాయపురంలోని కోల్పింగ్ సెంటరులో ఈ నెల 19వరకు జరిగే జాతీయ సమైక్యత శిబిరంలో బుధవారం జాతీయస్థాయి యువసాధికారత సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అదనపు జేసీ మాట్లాడుతూ యువత దేశ సంక్షేమం, సమగ్రత కోసం కృషి చేయాలని హితవు పలికారు. జిల్లా యువ కేంద్రం కోఆర్డినేటర్ బి.జె.ప్రసన్న మాట్లాడుతూ పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన గ్రామీణ యువతీ యువకులతోపాటు మన రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి ఎంపిక చేయబడిన వారు శిబిరంలో పాల్గొంటున్నారని చెప్పారు.
 
 అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
 శిబిరంలో పాల్గొన్న యువత ప్రదర్శించిన నృత్యాలు, మార్షల్ ఆర్ట్స్ ఆహూతులను అలరించాయి. జానపద నృత్యాలు, కర్రసాము, చెక్క భజనలు, కోలాటం చూపరులను కట్టిపడేశాయి. వివిధ జిల్లాల యూత్ కోఆర్డినేటర్లు, కోల్పింగ్ సెంటర్ యూత్ డెరైక్టర్ ఫాదర్ బాలస్వామి, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ శివశంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు