ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యమందిస్తాం

2 Oct, 2019 11:08 IST|Sakshi
వృద్ధుల ప్రత్యేక వార్డును ప్రారంభిస్తున్న బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ

బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ

సాక్షి, హిందూపురం(అనంతపురం) : రాష్ట్రంలోని పేదలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే ప్రభుత్వ కర్తవ్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ అన్నారు. మంగళవారం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో వమోవృద్ధులకు ప్రత్యేక వార్డు, గుండెజబ్బుల ఐసీయూ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. వార్డుల్లోని రోగులను మంత్రి ప్రత్యేకంగా పరామర్శించి వైద్యసేవలు, సదుపాయల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత బ్లడ్‌బ్యాంకులో రక్తదానం చేస్తున్న దాతలను అభినందిస్తూ వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సంరద్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీకి ప్రత్యేక స్థానం కల్పిస్తూ.. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేని విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. హిందూపురం ఆసుపత్రిలో వృద్ధులకు, గుండె జబ్బుల వారికి ఐసీయూ, డయాలసిస్‌ వంటి మెరుగైన వైద్య సేవలు అందించడానికి అన్నిరకాల చర్యలు చేపడుతున్నామని చెప్పారు.  

వైద్య సిబ్బందిని నియమిస్తాం... 
హిందూపురం ఆసుపత్రిలో మాతశిశు కేంద్రంలో, ఇతర విభాగాల్లో వైద్యుల కొరతను దృష్టిలో పెట్టుకుని అవసరమైన వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. హిందూపురం ఆసుపత్రిలో రెఫరల్‌ ఆసుపత్రిగా కాకుండా మెరుగైన వైద్యం అందించేలా జిల్లా స్థాయి వైద్య సదుపాయలు కల్పిస్తామన్నారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌ఓ రామసుబ్బారావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ దివాకర్, డీసీహెచ్‌ రమేశ్‌నాథ్, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కేశవులు, ఆర్‌ఎంఓ రుక్మిణమ్మ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు శ్రీరాంరెడ్డి, మైనార్టీ నాయకులు ఫజుల్‌ రెహమాన్, మాజీ కౌన్సిలర్లు ఆసిఫుల్లా, రెహమాన్, నాయకులు బసిరెడ్డి, ఉదయ్, సోమశేఖర్‌రెడ్డి, గంగిరెడ్డి, బండ్లపల్లి జబీ, శివశంకర్‌రెడ్డి, తిమ్మారెడ్డి, ఉమర్‌ఫరూక్, పరిగి నాయకులు బాలాజి, గజేంద్ర, తదితరులు పాల్గొన్నారు. 

మంత్రికి పలు వినతులు 
హిందూపురం ఆసుపత్రిలో వార్డు ప్రారంబోత్సవానికి విచ్చేసిన బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణకు పలువురు వినతిపత్రాలు అందించి సమస్యలు పరిష్కారించాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వం డిసెంబర్‌ నుంచి తమకు వేతనాలు నిలిపివేసిందని, ఇప్పటి వరకు పది నెలల వేతనాలు అదలేదని బ్లడ్‌బ్యాంకులో పనిచేస్తున్న నర్సింగ్‌ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని తిరిగి ఇప్పించడానికి సహాయం చేయాలని మంత్రిని కోరారు. 70 ఏళ్లుగా నివసిస్తున్న తమ ఇళ్ల వద్ద మున్సిపల్‌ అధికారులు కనీసం రోడ్డు, డ్రైనేజీలు నిర్మించలేదని తమపై వివక్ష చూపుతున్నారని బాపూజీ మరిజన యువజన సేవా సంఘం నాయకులు వాపోయారు. ఈ విషయమై పలుమార్లు ఎమ్మెల్యే, గత మున్సిపల్‌ పాలకులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. తమకు మౌళిక సదుపాయలు కల్పించాలని సంఘ నాయకులు నాగరాజు, అశోక్, పవన్‌ వినతిపత్రం అందించారు. 

మరిన్ని వార్తలు