హామీలను అమలు చేయడమే లక్ష్యం 

10 Aug, 2019 09:12 IST|Sakshi

పల్లె పిలుపు కార్యక్రమంలో మంత్రి శంకరనారాయణ 

సాక్షి, తాడంగిపల్లి: ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని తాడంగిపల్లి, మోపుర్లపల్లి, ఎం.కొత్తపల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు  ఘన స్వాగతం పలికారు. ముందుగా రొద్దంలో అంబేడ్కర్, వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాడంగిపల్లి గ్రామంలో మండల కన్వీనర్‌ బి.నారాయణరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పెనుకొండ నియోజకవర్గంతో పాటు అనంతపురం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. త్వరలోనే హంద్రీనీవా కాలువ వెంట ఉన్న చెరువులకు నీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామన్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, అయినా వైఎస్‌ జగన్‌ భయపడకుండా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలైన నవరత్నాలను పార్టీలకు, కులమతాలకు అతీతంగా అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.  25 ఏళ్లుగా నియోజకవర్గాన్ని పాలించిన నాయకులు ప్రజలకు చేసింది శూన్యమన్నారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ హమీద్‌బాషా, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ నసీమా, పీఆర్‌ జేఈ వహబ్, ప్రభుత్వ వైద్యుడు రోహిల్, అన్ని శాఖల అధికారులు, సింగిల్‌ విండో అధ్యక్షుడు మారుతిరెడ్డి, చైర్మన్లు లక్ష్మినారాయణ, విజయలక్ష్మి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కలిపి సొసైటీ అధ్యక్షుడు రాజారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కలిపి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు