నాదే రాజ్యం నేనే రాజు

21 Apr, 2018 10:41 IST|Sakshi

విజృంభిస్తున్న దోమలు 

ప్రబలుతున్న రోగాలు

నిధులు ఖర్చవుతున్నాయ్‌.. అయినా కుట్టేస్తున్నాయ్‌

ఫాగింగ్‌ అంతంతమాత్రమే

మలేరియా విభాగంపై నియంత్రణ శూన్యం

కార్పొరేషన్‌ నిధులు మస్కిటో కాయిల్‌లా కాలిపోతున్నాయి. సామాన్యుడి జేబులో డబ్బులు నీరులా ఆవిరైపోతున్నాయి. కానీ.. నగరంలో తిరుగుతున్న దోమకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. సంతతి పెంచుకుంటూ వేధిస్తున్నాయి. రక్త పిపాసుల్లా మారి ఇంటింటిలోనూ వ్యాధుల కుంపటి పెడుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ దాఖలాలు కనిపించడం లేదు. ఓ వైపు దోమల పనిపట్టేందుకు పక్కా ప్లాన్‌తో టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని ఊదరగొట్టిన అధికారులు.. ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. మరోవైపు ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా స్మార్ట్‌ నగరం దోమల రాజ్యంలా మారిపోతూ.. నగర జీవికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

విశాఖసిటీ : నగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. దోమల వల్ల ప్రబలుతున్న కేసుల సంఖ్య తగ్గిందని గతంలో బాహాటంగా ప్రకటించిన గ్రేటర్‌ అధికారులు.. ఇప్పుడు దోమనెలా తరమాలా అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల డెంగూ వ్యాధి బారిన పడిన కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతేడాదితో పోల్చి చూస్తే.. ఈ ఏడాది దోమల వల్ల కలిగే వ్యాధుల కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఓవైపు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు జీవీఎంసీ పరిధిలో దోమల నివారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని కార్పొరేషన్‌ ప్రజారోగ్య విభాగం అధికారులు చెప్పినా.. ఫలితం మాత్రం శూన్యమనేది గణాంకాలు చెబుతున్నాయి.

నామమాత్రంగా నివారణ చర్యలు
దోమలపై యుద్ధం ప్రకటిస్తున్నంతగా ఊదరగొడుతున్న ప్రజారోగ్య విభాగాధికారులు.. వాస్తవంగా మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నారు. జీవీఎంసీ పరిధిలో దోమల నివారణకు కచ్చితంగా ఫాగింగ్‌ చేయాల్సిన అవసరం ఉంది. అయితే.. మహా విశాఖనగర పాలక సంస్థ పరిధిలో కేవలం 40 నుంచి 45 శాతం ప్రాంతాల్లో మాత్రమే ఫాగింగ్‌ చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాస్తవంగా సిబ్బంది చేస్తోంది 25 నుంచి 30 శాతం ప్రాంతాలకు మాత్రమే. లెక్కల్లో తారుమారు చేసేస్తూ నిధులు స్వాహా చేసేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో అసలు ఫాగింగ్‌ ఏడాదికి ఒకసారైనా చేయడం లేదంటే పాలకులకు ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఏటా ఫాగింగ్‌ మొదలైన దోమల నివారణ చర్యలకు జీవీఎంసీ సుమారు రూ.1.48 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంతలా ఖర్చు చేస్తున్నా.. దోమలు చావడం లేదని ప్రజారోగ్య విభాగం పరిశీలనలో తేలింది. 

దెబ్బ తగిలిన చోటే మందు రాస్తున్నారు
జీవీఎంసీ మలేరియా విభాగంలో 170 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అదనంగా 250 మంది కార్మికులను ఏటా టెండర్ల ప్రక్రియ ద్వారా నియమిస్తుంటారు.  వీరంతా రోజూ వార్డుల్లో పర్యటించి కాలువలు, గెడ్డల్లో దోమల లార్వాలను నశింపజేసే రసాయనాలు పిచికారి చేయాలి. అయితే వీరి విధులపై నియంత్రణ లేకపోవడంతో ఎవరికి నచ్చినట్లు వారు వ్యవహరిస్తూ పని చేయకుండా కాలం గడిపేస్తుంటారు. ఎక్కడైనా మలేరియా, డెంగ్యూ కేసులు నమోదైనట్లు తెలిస్తే ఆ ప్రాంతాల్లో మాత్రమే స్ప్రేయింగ్‌ చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. దోమల వ్యాధుల నివారణకు వినియోగించే మందుల నిల్వలు, వాటి సరఫరా, కార్మికుల సంఖ్య, విధులు, విధానాలు, ఫాగింగ్‌ యంత్రాల పనితీరు మొదలైన అంశాలపై స్వయంగా కమిషనర్‌ పర్యవేక్షిస్తే తప్ప ప్రజారోగ్య విభాగంలో మార్పు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. మరోవైపు.. దోమల వ్యాప్తి నివారణపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది.

స్మార్ట్‌ డెన్సిటీ సిస్టమ్‌ ఎక్కడ? 
నగరంలో దోమల వ్యాప్తి పెరుగుతుండటంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని రాష్ట్ర పురపాలక విభాగం ఏడాది కిందట ప్రణాళికలు రూపొందించి పైలట్‌ ప్రాజెక్టుగా జీవీఎంసీని ఎంపిక చేసింది. ప్రాణాంతక దోమలు ఎక్కడున్నాయో టెక్నాలజీ ద్వారా గుర్తించి వాటిని నాశనం చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నామంటూ అధికారులు ప్రకటించారు. స్మార్ట్‌ మస్కిటో డెన్సిటీ సిస్టమ్‌ పేరుతో ఈ విధానం అమలు చేసేందుకు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో రెండు నెలల్లో ప్రారంభించాలని అనుకున్న ఈ ప్రాజెక్టు ఏడాది గడిచినా పట్టాలెక్కలేదు. దోమలను గుర్తించేందుకు ఎక్కడికక్కడ సెన్సార్లు ఏర్పాటు చేయాలని భావించారు. చదరపు కిలోమీటర్‌కు 10 సెన్సార్లు చొప్పున వీధుల్లోని విద్యుత్‌ స్తంభాలకు వీటిని అమర్చి ఆ ప్రాంతాల్లో ఉన్న దోమలను గుర్తించి.. వాటిని మందులతో సంహరించాలన్న ఈ ప్రాజెక్టుకు ఇంత వరకు బీజం పడలేదు.

సమస్యాత్మక ప్రాంతాలివీ
జీవీఎంసీ పరిధిని 3 రోగ విభాగాలుగా విభజించారు.
డెంగ్యూ జోన్‌ :  సింథియా, శ్రీహరిపురం, మల్కాపురం, గాజువాక, ఎన్‌ఏడీ, గోపాలపట్నం, పెందుర్తి తదితర ప్రాంతాలు
మలేరియా జోన్‌: దొండపర్తి, అక్కయ్యపాలెం, మర్రిపాలెం, ఆరిలోవ, అంబేడ్కర్‌నగర్, ఎండాడ, శివాజీపాలెం, గొల్లలపాలెం, మద్దిలిపాలెం, సీతమ్మధార, సీతంపేట, వీఐపీ రోడ్డు తదితర ప్రాంతాలు చికున్‌ గున్యా జోన్‌: సిరిపురం, వన్‌టౌన్, బీచ్‌రోడ్డు, 
జగదాంబ, పూర్ణామార్కెట్, కురుపాం, బురుజుపేట, రామకృష్ణ మార్కెట్‌ జంక్షన్‌ తదితర ప్రాంతాలు  
కేఆర్‌ఎం కాలనీ, కొబ్బరితోట, గొల్లలపాలెంలో డెంగ్యూ వ్యాప్తి చేసే ఈడిస్‌ దోమలు పెరుగుతున్నాయి. కాగా.. మలేరియాను వ్యాప్తి చేసే ఆడ అనాఫిలస్‌ దోమలను గుర్తించే వ్యవస్థ ఇప్పటి వరకూ జీవీఎంసీలో లేకపోవడం గమనార్హం. 

సంపాదనలో సగం దోమల కోసమే..
జీవీఎంసీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో.. దోమ రహిత నగరంగా మారడం కల్లగా మారిపోయింది. ఫలితంగా కార్పొరేషన్‌ ఖజానాను ఖాళీ చేస్తున్న దోమలు ప్రజల డబ్బునీ  ఆవిరి చేసేస్తున్నాయి. ఒక కాయిల్‌ బాక్స్‌ కొనేందుకు నెలకు రూ. 90  చొప్పున ఏడాదికి రూ.1100 పైన ఖర్చు చేస్తున్నారు. లిక్విడ్‌ జెల్స్‌ కోసం మరో రూ.1500, మస్కిటో బ్యాట్‌లు కొనుగోలు, వాటి నిర్వహణకు రూ.500 ఇలా.. దోమలను ఇంటినుంచి తరిమేందుకు ఏడాదికి సగటు నగర జీవికి రూ.3 వేలకు పైనే చేతి చమురు వదులుతోంది. ఇదిలా ఉండగా.. మలేరియా, డెంగ్యూతో పాటు ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరగడం వల్ల ఏడాదికి రూ.5,000 నుంచి రూ.10000 వరకూ ఖర్చు చేస్తున్నారు.

రాత్రిళ్లు నిద్ర ఉండట్లేదు
దోమలు ఒక్కోసారి తగ్గుముఖం పడుతున్నాయి. నెల తర్వాత పెరిగిపోతున్నాయి.  వాటిని తరిమేందుకు నానా యాతన పడాల్సి వస్తోంది. రాత్రిళ్లు నిద్ర ఉండట్లేదు. అప్పుడప్పుడు ఫాగింగ్‌ చేస్తున్నారు కానీ, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. ఫాగింగ్‌ చేసిన రెండు రోజులకే దోమలు పెరిగిపోతున్నాయి.
–బొడ్డేపల్లి సుధ, కంచరపాలెం

బడ్జెట్‌లో వాటి కోసం కేటాయింపు
దోమలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కార్పొరేషన్‌ వాళ్లు స్ప్రేయింగ్‌ చేయడం, మూడు నెలలకోసారి ఇంటికి వచ్చి మలేరియా, డెంగ్యూ గురించి చెబుతున్నారు. కానీ.. పూర్తిగా దోమలను నివారించలేకపోతున్నారు. ఇంటికి రాకుండా చేసేందుకు కిటికీలకు నెట్‌లు పెట్టాం. నెలసరి బడ్జెట్‌లో దోమల కోసం కొంత కేటాయించాల్సిన పరిస్థితి తలెత్తింది.
– వెంకటరమణ, లలితానగర్‌

దోమల నివారణకు ముందస్తు కార్యాచరణ
నగరంలో దోమల నివారణకు అవసరమైన చర్యలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నాం. జీవీఎంసీ పరిధిలో డెంగ్యూ కేసులు నమోదు కాకుండా, నమోదైన కేసులను నివారించేందుకు కమిషనర్‌ ఆదేశాలతో ఏటా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. మరోవైపు వార్డుకో బృందం చొప్పున దోమల ఉత్పత్తికి కారణమయ్యే ప్రాంతాల గురించి, వాటి వల్ల వచ్చే అనర్థాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం డ్రై డే పాటించాలని ప్రచారం చేస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో 59 వేల వరకూ దోమ తెరలు పంపిణీ చేశాం. యాంటీ లార్వా కార్యక్రమాలు చేపడుతున్నాం. 
– ఎంవీవీ మురళీమోహన్, ఏఎంహెచ్‌వో, జీవీఎంసీ 

మరిన్ని వార్తలు