మలేరియా విజృంభణ

1 May, 2020 13:36 IST|Sakshi
భీమరాజు మృతదేహాన్ని పలకజీడి నుంచి పాలసముద్రానికి డోలీలో తరలిస్తున్న బంధువులు

కొయ్యూరు మండలంలో ఇద్దరి మృతి

నక్కపల్లి మండలంలో మరో ఇద్దరు

గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు

కొయ్యూరు(పాడేరు): కొయ్యూరు మండలంలో మలేరియా ప్రబలుతోంది. యూ.చీడిపాలెం ఆరోగ్య కేంద్రం పరిధిలో పలువురు మలేరియా బారిన పడడంతో  స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పాలసముద్రం గ్రామానికి చెందిన కొర్రా భీమరాజు(29)కు బుధవారం తీవ్ర స్థాయిలో జ్వరం వచ్చింది. అతనికి రక్తపరీక్షలు నిర్వహించగా మలేరియాగా తేలింది. దీంతో పాలసముద్రం నుంచి పలకజీడి వరకు భీమరాజును డోలీలో తరలించారు. అక్కడి నుంచి   వై.రామవరం కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా గంగవరం సమీపంలో మృతిచెందాడు. ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న నీలవరం,గంగవరం,మర్రిపాకల్లో  పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు.  నాలుగు రోజుల కిందట అదే పంచాయతీలో వేమనపాలానికి చెందిన రమేష్‌ అనే వ్యక్తి జ్వరంతో 25న  మృతి చెందాడు. అతనికి మలేరియా లేదని వైద్యులు చెప్పినా అతని కుటుంబంలో  ముగ్గురికి మలేరియా పాజిటివ్‌ వచ్చింది. అతను మరణించిన నాడే భార్య ప్రసవించింది.పుట్టిన మగబిడ్డకు శరీరమంతా కురుపులు రావడంతో వై.రామవరం ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. జిల్లా మలేరియా అధికారి మణి గ్రామాన్ని సందర్శించారు.  గురువారం జిల్లా మలేరియా అధికారి మణి, పాడేరు అదనపు వైద్య ఆరోగ్య అధికారి లీలాప్రసాద్‌  పాలసముద్రం గ్రామాన్ని సందర్శించారు. 

కవలలు మృతి
ఈనెల 27న గెమ్మెలి లక్ష్మికి వేమనపాలెంలో కవలలు జన్మించారు.కొద్ది సేపటికే మరణించారని వైఎస్సార్‌ సీపీ నాయకుడు దడల రమేష్‌ తెలిపారు.ఏడో నెలలో ప్రసవం అయినట్టు  వైద్య సిబ్బంది చెబుతున్నారని చెప్పారు. ఆమెను కూడా వైద్య సిబ్బంది వై.రామవరం ఆస్పత్రికి తరలించారు. 

గ్రామాల్లో వైద్య శిబిరాలు
అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా ఐటీడీఏ పీవో బాలాజీ తెలిపారు. జిల్లా మలేరియా అధికారి, ఏడీఎంహెచ్‌వోలు ఆ గ్రామాలను సందర్శించి పూర్తి విషయాలు తెలుసుకుంటారన్నారని చెప్పారు.

బోయపాడులో  ఇద్దరి మృతి
నక్కపల్లి(పాయకరావుపేట): మండలంలో రాజయ్యపేట శివారు బోయపాడులో జ్వరాలు విజృంభించాయి. ఇద్దరు మృత్యువాత పడగా సుమారు 20 మంది అస్వస్థతకు గురైనట్టు గ్రామస్తులు తెలిపారు. టీబీతో బాధపడుతున్న గ్రామానికి చెందిన బోంది లక్ష్మణ(65) తీవ్రమైన జ్వరంతో రెండు రోజుల క్రితం మరణించాడు.  పిక్కి తలుపులు(32) అనే వ్యక్తి కూడా తీవ్రమైన జ్వరంతో గురువారం విశాఖలో మరణించాడు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మరణించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గొడిచర్ల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌  కిషోర్‌ బుధవారం వైద్య శిబిరం ఏర్పాటు చేసి, మందులు పంపిణీ చేశారు.  పరీక్షల్లో సాధారణ జ్వరాలేనని నిర్థారణ అయిందని ఆయన చెప్పారు.  ప్రస్తుతం 8 మందికి జ్వరం ఉండడంతో వారి నుంచి రక్తపూతలు సేకరించినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు