లైంగికంగా లొంగితే సరి! లేదంటే..

13 Feb, 2020 09:10 IST|Sakshi
డాక్టర్‌కు దేహశుద్ధి చేస్తున్న నర్సు బంధువు     

మహిళా ఉద్యోగులకు దినదిన గండం

గతంలో పలువురు వైద్యులపై చర్యలు తీసుకున్నా కానరాని మార్పు

తాజాగా ఉదయగిరి సీహెచ్‌సీ డాక్టర్‌కు దేహశుద్ధి

పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటున్న కొంత మంది డాక్టర్లు కీచకులుగా వ్యవహరిస్తున్నారు. తమ కింద పనిచేసే మహిళా సిబ్బంది, నర్సులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తమ మాట వింటే సరి.. లేదంటే విధులు సరిగా నిర్వహించడం లేదని రకరకాలుగా వేధిస్తున్నారు. చీటికి మాటికి సూటిపోటి మాటలు, చీదరింపులు.. మెమోలు జారీ చేసి మానసికంగానూ క్షోభ పెడుతున్నారు. జిల్లాలో గతంలో ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగుచూశాయి. వీటిపై విచారణ జరిపిన అధికారులు సంబంధిత వైద్యాధికారులపై చర్యలు తీసుకున్నా.. మార్పు కనిపించడం లేదు.  

సాక్షి, నెల్లూరు (అర్బన్‌): జిల్లాలో కొందరు వైద్యులు.. కామాంధులుగా ప్రవర్తిస్తున్నారు. వైద్య శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగినులు వీరి వికృత చేష్టలకు కుమిలిపోతున్నారు. తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని లైంగికంగా లొంగ దీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. లొంగితే సరి.. లేదంటే ఉద్యోగపరంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉద్యోగం కోసం కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉద్యోగ ఒత్తిళ్లతో పాటు అధికారుల వేధింపులను మౌనంగా భరిస్తూ కన్నీళ్లను పంటి బిగువునే దాచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో అల్లూరు మండలం ఇస్కపల్లి పీహెచ్‌సీలో జరిగిన ఘటన మరువక ముందే తాజాగా ఉదయగిరి సీహెచ్‌సీలో ఒక నర్సును వేధించిన కేసులో ఆమె బంధువులు సదరు డాక్టర్‌కు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనతో వైద్యశాఖలో కలకలం రేగింది.  

ఆమ్లెట్‌ వేసుకు రావాలని చెప్పి..   
అతని పేరు డాక్టర్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌. ఉదయగిరి సీహెచ్‌సీ (సామాజిక ఆరోగ్య కేంద్రం) డాక్టర్‌గా  పనిచేస్తున్నాడు. చేసేది పవిత్రమైన వైద్యవృత్తి. తన వద్దకు వైద్యం కోసం వచ్చే రోగులను, వైద్యశాలలో పనిచేసే సహా ఉద్యోగులు, సిబ్బందిని తమ బిడ్డల్లా చూసుకోవాల్సిన వ్యక్తి బుద్ధి వక్రీకరించింది. సీహెచ్‌సీ 24 గంటలు పనిచేసే ఆస్పత్రిగా ఉంది. డాక్టర్‌ సీహెచ్‌సీలోని పై అంతస్తు భవనంలో డాక్టర్‌ ఉంటున్నాడు. తండ్రి వయస్సులో ఉన్న ఆ వైద్యుడు తన వద్ద పని చేసే ఓ స్టాప్‌ నర్సుపై కన్నేశాడు. తన కామ వాంఛ తీర్చుకునేందుకు ఆ నర్సును ఇంటి దగ్గర నుంచి ఆమ్లెట్‌ వేసుకుని రావాలని ఫోన్‌ చేశాడు. తన ఉన్నతాధికారి అని ఆమ్లెట్‌ తీసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అదను కోసం వేచి ఉన్న ఆ డాక్టర్‌ తన లైంగిక వాంఛ తీర్చాలని డిమాండ్‌ చేశాడు. సార్‌.. మీరు తన తండ్రి సమానులు.. తనను అలా చూడొద్దని చెప్పినా.. ఆ మాటలు అనొద్దు.. అంటూ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

ఇంతలో ఆమెకు ఫోన్‌ రావడంతో పది నిమిషాల్లో వస్తానని బయటకు వచ్చి తన భర్తకు జరిగిన విషయం చెప్పడంతో భర్త, బంధువులు కలిసి ఆస్పత్రికి చేరుకుని ఆ డాక్టర్‌కు దేహశుద్ధి చేశారు. డాక్టర్‌ ఠాగూరు వ్యవహార శైలిపై మొదట నుంచి పలు ఆరోపణలు ఉన్నాయి. పొదలకూరు ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే సమయంలో తమ వద్దకు వైద్యం కోసం వచ్చిన ఓ గర్భిణితో అభస్యకరంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. తమ పలుకుబడి ఉపయోగించుకుని తక్కువ సమయంలోనే తిరిగి విధుల్లో చేరాడు. ఆయన పని చేసిన ప్రతి చోట నర్సులను ఇదే విధంగా వేధించే వారనే ఆరోపణలు ఉన్నాయి.   

ఆ డాక్టర్‌ తీరు మారదు 
సదరు డాక్టర్‌ ఇప్పటికే రెండు దఫాలు సస్పెండ్‌ అయ్యారు. ముత్యాలరాజు కలెక్టర్‌గా ఉన్నప్పుడు పొదలకూరులో పని చేసేటప్పుడు ఇలా ఓ నర్సును వేధించిన విషయంలో క్రిమినల్‌ కేసును ఎదుర్కొన్నారు. పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజకీయ జోక్యం, యూనియన్‌ నాయకుల అండతో ఎలాగోలా బయటపడ్డారు. తొలుత వేధించడం ఆపై ఎదురు తిరిగితే కాళ్ల బేరానికి రావడం మామూలే. గతంలో వైద్యశాఖకు చెందిన ఓ యూనియన్, డీఎంహెచ్‌ఓ సమక్షంలోనే ఆ డాక్టర్‌ బాధితురాలికి క్షమాపణ చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే ఆ డాక్టర్‌ మరోచోట బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే ఇంకో నర్సును వేధించడం విశేషం. ప్రస్తుతం జరిగిన సంఘటనపై జిల్లా అధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఇతనిపై కేసు కూడా నమోదు కానుంది. నేడో...రేపో సస్పెండ్‌ వేటు వేయడమే కాకుండా పోలీసులు కూడా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. 
ఇస్కపల్లిలో అదే పరిస్థితి  
ఇటీవల అల్లూరు మండలం ఇస్కపల్లి పీహెచ్‌సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)లో పనిచేస్తున్న ఒక ఆశను అక్కడ పని చేసే డాక్టర్‌ లైంగికంగా వేధించసాగాడు. దీంతో అక్కడున్న నర్సింగ్‌ సిబ్బందంతా కలిసి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సూచన మేరకు విషయాన్ని పరిశీలించిన కలెక్టర్‌ శేషగిరిబాబు ఆ డాక్టర్‌ను వైద్యశాఖకు సరెండర్‌ చేశారు. పెద్దాస్పత్రిలోనూ గతంలో ఇలాంటి ఘటనలు జరిగినట్టు పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. ఇలాంటి మరికొన్ని ఘటనలు జిల్లాలో జరిగాయి. దిశ లాంటి చట్టాలతో వేధింపులకు గురి చేసే వారిని కఠినంగా శిక్షించాలని వైద్యశాఖలోని మహిళా సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు.

విచారించి చర్యలు చేపడుతాం 
కొన్ని వీడియోలు తనకు కూడా చేరాయి. అయితే ఏమి జరిగిందో తొలుత విచారిస్తాం. గతంలో జరిగిన విషయాలు పరిశీలిస్తాను. విచారణ అనంతరం అన్ని విషయాలు కలెక్టర్‌కు తెలియ చేస్తాను. తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్‌ సుబ్బారావు, డీసీహెచ్‌

>
మరిన్ని వార్తలు