విజయవాడ విద్యార్థికి ‘గిన్నిస్‌’లో స్థానం 

28 Mar, 2020 09:53 IST|Sakshi

8 గంటల పాటు 36 భారతీయ భాషలు, 69 విదేశీ భాషల్లో పాటలు 

సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన విద్యార్థి మల్లాది రాహత్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. 2018 జనవరి 6వ తేదీన గాంధీనగర్‌లోని హోటల్‌ ఐలాపురంలో దాదాపు 8 గంటలపాటు 36 భారతీయ భాషలు, 69 విదేశీ భాషల్లో మొత్తం 105 పాటలు పాడి రికార్డ్‌ సృష్టించాడు. (వివిధ భాషల్లో 76 పాటలు పాడిన గజల్‌ శ్రీనివాస్‌ పేరిట గత రికార్డు ఉండేది). అన్ని రకాలుగా పరిశీలించిన అనంతరం వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌›లో రాహత్‌ పేరు నమోదు చేసి ‘మోస్ట్‌ లాంగ్వేజెస్‌ సంగ్‌ ఇన్‌ కాన్సర్ట్‌’ బిరుదుకు ఎంపిక చేసినట్లు గురువారం సమాచారం అందించారు.

రాహత్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గతంలో సాక్షి దినపత్రిక నిర్వహించిన పోటీలో వండర్‌ కిడ్‌ అవార్డు అందుకున్నాడు. పలు సాంస్కృతిక సంస్థలు ఉగాది పురస్కారాలతో సత్కరించాయి. బాలల చిత్రం దాన వీర శూర కర్ణ చిత్రంలో శకునిగా నటించడంతోపాటు ఇతర పౌరాణిక నాటకాలలో శ్రీకృష్ణుడు, అనిరుద్ధుడు, నారదుడు, శ్రీ మహావిష్ణువు పాత్రలలో నటించి మెప్పించాడు. గతేడాది నంది నాటకోత్సవాల్లో పౌరాణిక నాటక విభాగంలో నంది అవార్డ్‌ గెలుచుకున్నాడు. రాహత్‌కు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కడం పట్ల నగరానికి చెందిన పలు కళా సంస్థలు, రాహత్‌ చదువుతున్న పాఠశాల అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. 


 

మరిన్ని వార్తలు