‘చంద్రబాబు వల్లనే విజయవాడ వెనకబడింది’

17 May, 2020 11:36 IST|Sakshi

ఎమ్మెల్యే మల్లాది విష్ణు

సాక్షి, విజయవాడ: కరోనా ఎఫెక్ట్ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆయన ఆదివారం విజయవాడసెంట్రల్ నియోజకవర్గంలోని మధురానాగర్ రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. నరసాపురం, విజయవాడ రైల్వే లైన్‌లో మధురానగర్ వద్ద 20 కోట్లతో రైల్వే బ్రిడ్జ్ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక విజయవాడకు రూ. 100 కోట్లు కేటాయించడంతో పాటు మధురానగర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్‌కి రూ. 20 కోట్లు కేటాయించారని ఆయన గుర్తుచేశారు. టీడీపీ హయాంలో రైల్వే వారు ముందుకు వచ్చి టెండర్లు పిలిచినా ప్రభుత్వం, నగర పాలక సంస్థ పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాత్రం ఓట్ల కోసం పెద్ద శిలాఫలకం వేసి హడావుడి చేశారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం వచ్చాక దానిని కార్యాచరణ రూపంలోకి తెచ్చామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.

రైల్వే, నగరపాలక సంస్థ కలిసి ఈ ఆర్‌యూబీని నిర్మిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ బ్రిడ్జ్‌ పనులు ఆరు నెలల్లోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు సాగుతున్నాయని ఆయన చెప్పారు. విజయవాడ నగరం పట్ల తమ ప్రభుత్వం, సీఎం జగన్‌ చిత్తశుద్ధితో ఉన్నారని ఆయన తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని డివిజన్లలో రూ. 40 కోట్లుతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నాయకులకు నగర అభివృద్ధి గురించి మాట్లాడితే నైతిక హక్కు లేదని, వారి పాలనలో నగర అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని మల్లాది విష్ణు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డి జన్మదినోత్సవం నాడు 30 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 21లోపు అర్హులు ఎవరైనా తమకు ఇళ్లు కావాలని దరఖాస్తు చేస్తే ఇచ్చేలా చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. 

మధురానగర్‌ను మోడ్రన్ డివిజన్‌గా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల సంబంధించిన మౌళిక సదుపాయాల కల్పనలో వైఎస్సార్‌సీపీ ముందు ఉందని ఆయన తెలిపారు. విజయవాడ చంద్రబాబు నాయుడు, వారి ఎమ్మెల్యేలు, ఎంపీల మూలంగానే వెనకబడిపోయిందని ఆయన మండిపడ్డారు. ఆశించిన దాని కన్న అభివృద్ధి, సంక్షేమంలో ముందు ఉన్నామని ఆయన చెప్పారు. ఎవరిని అడిగి కరెంట చార్జీలపై గగ్గోలు పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం టారిఫ్‌లు, స్లాబులు మార్చడం కానీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా మిల్క్ ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారి శిష్యుల చేతిలో 40 సంవత్సరాల నుంచి ఉందన్నారు. విజయవాడ నగరంలో ప్రజలు లక్ష లీటర్ల పాలను వినియోగిస్తారు. ఎవరిని అడిగి లీటర్‌కు రూ.4 రూపాయలు పెంచారని మల్లాది విష్ణు ప్రశ్నించారు. మిల్క్ ఫ్యాక్టరీ చైర్మన్చెలసాని ఆంజనేయులు, టీడీపీ రైతు విభాగం అధ్యక్షులు ఒకొక్క కుటుంబంలో నాలుగు లీటర్ల పాలు వాడుతుంటే చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ముసలి కన్నీరు కార్చుతున్నారని ఆయన మండిపడ్డారు.

విజయవాడ నగరంలో వాడే పాలపై బాబు శిష్యులు నాలుగు రూపాయల ప్రత్యక్ష పన్ను వేశారని ఆయన ధ్వజమెత్తారు. గుంటూరు రూ. 30 రూపాయలు తక్కువగా, ఇక్కడ రూ.30 రూపాయలు ఎక్కువకరెంట్ చార్జీలు పెరిగాయని గగ్గలో పెట్టేవారు బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సవాల్‌ విసిరారు. కరెంట్‌ చార్జీలను చంద్రబాబు పెంచారో లేక తమ ప్రభుత్వం పెంచిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని కుహునా పార్టీలు సబ్ స్టేషన్ల దగ్గరకు వెళ్లి ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నాయని ఆయన ఫైర్‌ అయ్యారు. టీడీపీ వాళ్లు ఏది చెబితే అది నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఆయన అన్నారు.ఒకేసారి మూడు నెలల బిల్లులు ఇవ్వడంతో ప్రజల్లో కొంత అందోళన ఉందని, దానిని అధికారులు, ప్రజా ప్రతినిధులుగా స్పష్టతను ఇస్తామని ఆయన తెలిపారు. ఐదు సంవత్సరాలు ప్రజలు టీడీపీకి అధికారం ఇస్తే విజయవాడ నగరంలో చేసిన అభివృద్ధి శూన్యమని ఆయన మండిపడ్డారు. 
 

మరిన్ని వార్తలు