'బెజవాడ పరువు తీసిన బొండా'

19 Mar, 2015 09:33 IST|Sakshi
'బెజవాడ పరువు తీసిన బొండా'

విజయవాడ : అసెంబ్లీలో బజారు రౌడీలా ఎమ్మెల్యే బొండా ఉమా వ్యవహరించి విజయవాడ నగర ప్రజలు తలదించుకొనేలా చేశారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రరత్నభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లాది విష్ణు మాట్లాడుతూ...  రాజకీయ, సాంస్కృతిక, కళల రాజధానిగా రాష్ట్రంలోనే విజయవాడ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని... అలాంటి నగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బోండా ఉమా చిల్లర వేషాలతో బెజవాడ పరువును మంటగలిపారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రతిపక్ష సభ్యుల్ని అంతుతేలుస్తా, సంగతేంటో చూస్తా అని బెదిరించడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాకు చెందిన మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు ప్రతిపక్ష నేత వైఎస్ జగ న్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. మహిళా ఎమ్మెల్యేలను గౌరవించాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని బొండాను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు విజయవాడ సెంట్రల్ నియోజక వర్గ ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు.

ప్రజాసమస్యల్ని పరిష్కరించడానికి వేదిక కావాల్సిన అసెంబ్లీ బూతుపురాణానికి నిలయం కావడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించడం కోసం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ పార్లమెంట్‌లో తనవంతు ప్రయత్నాలు సాగిస్తోందన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్‌ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ధనయజ్ఞం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమను తెరపైకి తెచ్చారని విమర్శించారు.

మరిన్ని వార్తలు