బక్కచిక్కుతున్న బాల్యం

13 May, 2018 04:18 IST|Sakshi

కలవరపెడుతున్న పౌష్టికాహార లోపం

47.81 శాతానికి చేరిన ఎదుగుదలలేని శిశువుల సంఖ్య..  

సాక్షి, అమరావతి: పౌష్టికాహార లోపం రాష్ట్రాన్ని కలవర పరుస్తోంది. బరువు తక్కువ శిశువులు, ఎదుగుదల లేని(గిడసబారిన) పిల్లల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. సరిపడా పోషక విలువలు అందకపోవడం వల్ల లక్షలాది మంది గర్భిణులు, బాలింతలు, శిశువులు రక్తహీనతతో బాధపడుతున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద సగటున 11.33 శాతం మంది శిశువులు సాధారణం కంటే తక్కువ బరువుతో జన్మించినట్లు తేలింది. మరో 36.45 శాతం మంది ఎదుగుదలలేని శిశువులు జన్మించారు. మొత్తం మీద తక్కువ బరువు, ఎదుగుదల లేకుండా పుడుతున్న చిన్నారుల సంఖ్య 47.81 శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో వెల్లడైన ఈ గణాంకాలు చర్చకు దారితీశాయి. కర్నూలు, విజయనగరం, విశాఖ, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో తక్కువ బరువు గల శిశువులు ఎక్కువగా జన్మిస్తున్నట్లు వెల్లడైంది. పౌష్టికాహార లోపాన్ని చక్కదిద్దకపోతే ఇలాంటి శిశువులు పుడుతూనే ఉంటారని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పిల్లల్లో శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉండదని.. ఇది సమాజానికి తీవ్ర నష్టదాయకమన్నారు.

ఇప్పటికీ సుమారు సగం మంది శిశువులు ఇలా ఎదుగుదల లేకుండా పుట్టడం ఆందోళనకరమన్నారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోనే పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉన్నందున.. ఆయా ప్రాంతాల్లో పోషక విలువలున్న కొర్రలు, సజ్జలు, రాగులు పంపిణీ చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. వేరుశనగ పప్పు ఉండలు, కొర్రపాయసం, రాగి జావ లాంటివి పంపిణీ చేయాలని కొందరు సూచించారు. 

మరిన్ని వార్తలు