వైఎస్ విజయమ్మకు మమతా బెనర్జీ ఫోన్

8 Jul, 2013 01:37 IST|Sakshi
వైఎస్ విజయమ్మకు మమతా బెనర్జీ ఫోన్

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం మధ్యాహ్నం ఫోన్‌లో మాట్లాడారు. విజయమ్మ పులివెందులలో ఉన్న సమయంలో ఫోన్ చేసిన మమతా బెనర్జీ సుమారు పది నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. జాతీయ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, ఇతర పార్టీలు కలిసి నడిచే అవకాశాలు పరిశీలిద్దామని ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రతిపాదించారు. తన ప్రతిపాదనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి తెలియజేసి ఆయన అభిప్రాయం తెలుసుకోవాలని కూడా ఆమె విజయమ్మను కోరారు. అందుకు విజయమ్మ అంగీకరించారు. వీరిద్దరి సంభాషణలో జగన్ ఎలా ఉన్నారని మమత అడిగారు. ఆయన మీద ఉన్న కేసుల వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డితో తనకున్న పరిచయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికలు 2014 మే కన్నా ముందుగానే జరిగే అవకాశం ఉందని, ఈ ఏడాది నవంబర్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మమత అభిప్రాయపడ్డారు.
 

మరిన్ని వార్తలు