నా భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలి

16 Nov, 2018 12:26 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మమత

కడప రూరల్‌: తన  భర్త రాజేష్‌కుమార్‌ మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కడప నగరం, చిన్నచౌక్‌కు చెందిన మమత కోరారు. గురువారం స్ధానిక వైఎస్సార్‌ మెమోరియల్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన భర్త స్ధానిక ఎర్రముక్కపల్లెలోని ఒక షాపులో రాడ్‌ వెండర్‌గా పనిచేసేవాడని తెలిపారు.  గతనెల ఆ షాపు యజమాని ప్రసాద్‌రెడ్డి తన భర్తను విందు పేరుతో కడప నగర సమీపంలోని వాటర్‌ గండి వద్దకు తీసుకెళ్లాడని తెలిపారు. తరువాత తన భర్త తిరిగి ఇంటికి రాలేదన్నారు.

ఈ విషయమై స్ధానిక చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. తరువాత అదే నెల 26వ తేదీన ఆ ప్రాంతంలోనే తన భర్త మృతదేహం లభించిందన్నారు. తన భర్త మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తనకు ఒకటిన్నర ఏడాది పాప ఉందని, తాను తన తండ్రి వద్ద ఉంటున్నట్లు తెలిపారు. నిరుపేదనైన తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌కే నజీర్‌బాషా మాట్లాడుతూ మమతకు న్యాయం జరగకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మమత తండ్రి చిన్న కొండయ్య, బీఎస్పీ నాయకులు రవికుమార్, కానుగ దానం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు