లేఖతో మంత్రి అఖిలప్రియకు షాక్‌ ఇచ్చాడు..

7 Sep, 2017 01:31 IST|Sakshi
మంత్రి అఖిలప్రియ సంతకం ఫోర్జరీ
- ఆ లేఖను ఆమెకే ఇచ్చి దొరికిపోయిన టీడీపీ నేత 
- నిందితుడి వద్ద పలువురు మంత్రుల నకిలీ లెటర్‌హెడ్‌లు
 
సాక్షి, అమరావతి: పర్యాటక శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కోసం ఏకంగా ఆ శాఖ మంత్రి అఖిల ప్రియ సంతకాన్ని టీడీపీ నేత ఒకరు ఫోర్జరీ చేశారు. పైగా ఆ లేఖను సదరు మంత్రికే ఇవ్వడం బుధవారం సచివాలయంలో కలకలం రేపింది. గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన అలీ.. తనకు వారం రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలని మంత్రి అఖిల ప్రియ సిఫారసు చేసినట్లు ఫోర్జరీ లేఖ సృష్టించాడు. ఆ లేఖతో సచివాలయంలో టూరిజం కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనాను కలిశాడు. మంత్రి సంతకం ఉండటంతో ఆమెనే కలవాల్సిందిగా మీనా సూచించారు.

అదే లేఖ తీసుకెళ్లి మంత్రి అఖిల ప్రియకు ఇవ్వగా.. తాను ఎప్పుడు సిఫారసు చేశానని ఆమె ప్రశ్నించడంతో లలీ ఖంగు తిన్నాడు. సంతకం తనది కాదని, ఫోర్జరీ చేశారని.. దీని సంగతేంటో చూడండి అని మంత్రి పేషీ సిబ్బందికి సూచించారు.  వద్ద గుంటూరు జిల్లా టీడీపీ నేతల సంతకాలతో ఉన్న ఫోర్జరీ లేఖలు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే సచివాలయం ఎస్పీఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందించగా, వారు అలీని అదుపులోకి తీసుకున్నారు. అలీ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేల నకిలీ లెటర్‌ హెడ్‌లు కూడా ఉన్నాయని మంత్రి పేషీ సిబ్బంది పేర్కొన్నారు.

ఈ విషయమై అఖిల ప్రియ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ లేఖ చూసి ఆశ్చర్యమేసింది. నా మినిస్ట్రీ స్టాంప్‌ కూడా ఉంది. నా సంతకం ఫోర్జరీ చేసిన ఆలీ గతంలో నంద్యాలలో కూడా తిరిగాడు. వారంలో ఉద్యోగం ఇవ్వాలని నేను ఎవరికీ లేఖ ఇవ్వలేదు’ అన్నారు. అయితే అలీ టీడీపీ నేత కావడంతో అతను సాక్షాత్తూ మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసినా అతనిపై చర్యలు తీసుకోకపోవడం విశేషం.