నాడు వ్యవసాయం..నేడు అంతర్జాతీయ స్మగ్లింగ్‌..!

25 Nov, 2018 09:30 IST|Sakshi
ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న ఓఎస్‌డీ లక్ష్మినారాయణ మహమ్మద్‌ గయాజ్‌ అహ్మద్, ప్రధాన స్మగ్లర్‌ అనుచరుడు (ఫైల్‌)

2009 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముజీబ్‌భాయ్‌ 

ఇతనిపై మూడు జిల్లాలలో 49 కేసులు నమోదు 

ప్రధాన అనుచరులుగా మారిన గయాజ్‌ అహమ్మద్, లీలా కుమార్‌లు 

వీరిపై కూడా పలు కేసులు నమోదు 

ముజీబ్‌ గోడౌన్‌లపై మెరుపుదాడి

మూడు టన్నుల ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలు స్వాధీనం

సుమారు రూ. 5 కోట్ల విలువ 

అరెస్ట్‌ వివరాలను వెల్లడించిన ఓఎస్‌డీ (ఆపరేషన్స్‌) బి.లక్ష్మినారాయణ

కడప అర్బన్‌: ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం సంపదను కొల్లగొడుతూ.. 2009 నుంచి యథేచ్ఛగా స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు పాల్పడుతున్న కర్ణాటక రాష్ట్రం, హోస్‌కోట తాలూకా, కటిగెనహళ్లికి చెందిన సయ్యద్‌ ముజీబ్‌భాయ్‌ అలియాస్‌ మూస సామాన్య వ్యవసాయదారుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. తన స్వగ్రామంలో 2009 ముందు వరకు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. విలాసాలకు, దురలవాట్లకు బానిసగా మారిన ముజీబ్‌భాయ్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాడు. 

నిందితులు పట్టుబడిన వైనం
ఎర్రచందనం అక్రమ రవాణా గురించి అందిన సమాచారం మేరకు ఈనెల 23వ తేదీన జిల్లాలోని రాజంపేట మండలం రాయచోటి–రాజంపేట ప్రధాన రహదారిలో రోళ్ల మడుగు గ్రామం క్రాస్‌ వద్ద జిల్లా పోలీసులు నిర్వహించిన తనిఖీలలో చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన అంతర్‌ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌ గొంగన లీలాకుమార్‌ను అరెస్టు చేశారు. అతన్ని విచారిస్తుండగా వెల్లడించిన వివరాలతో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగర  శివార్లలో గోడౌన్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ ముజీబ్‌భాయ్‌ అలియాస్‌ మూసా, అతని ప్రధాన అనుచరుడు మహమ్మద్‌ గయాజ్‌ అహ్మద్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు ఐదు కోట్లు విలువజేసే 119 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోగా, వీటి బరువు మూడు టన్నుల మేరకు ఉంటుంది. వీటితోపాటు నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్టు వివరాలను కడప పోలీసు పెరేడ్‌గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) లక్ష్మినారాయణ వెల్లడించారు.

సిబ్బందిని అభినందించిన ఎస్పీ, ఓఎస్‌డీ
మోస్ట్‌ వాంటెండ్‌ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ సయ్యద్‌ ముజీబ్‌భాయ్‌ అలియాస్‌ మూసా, అతని అనుచరులు మహమ్మద్‌ గయాజ్‌ అహ్మద్, లీలాకుమార్‌లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన రాజంపేట డీఎస్పీ ఆర్‌.రాఘవేంద్ర, రాజంపేట రూరల్‌ సీఐ టి.నరసింహులు, మన్నూరు ఎస్‌ఐ మహేష్, కానిస్టేబుళ్లు ప్రభాకర్, చంద్రశేఖర్, సుభాన్‌బాషా, విజయదర్శన్‌రావు, పుల్లంపేట కానిస్టేబుళ్లు రమేష్, లక్ష్మికర్‌లను ఎస్పీ అభిషేక్‌ మహంతి, ఏఎస్పీ (ఆపరేషన్స్‌) డి.లక్ష్మినారాయణలు అభినందించారు. ఈ సందర్భంగా ఓఎస్‌డీ మాట్లాడుతూ జిల్లాకు నూతనంగా పోలీసు యంత్రాంగం వచ్చిందని, స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు పాల్పడితే గుర్తించలేరని స్మగ్లర్లు భావిస్తే సరికాదన్నారు. పోలీసు యంత్రాంగం ఎప్పటికీ స్మగ్లర్లపై నిఘా ఉంచుతుందని, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన పలువురు అంతర్జాతీయ, అంతర్‌రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లతో ఇతనికి సంబంధం ఉంది.

ఇతనిపై కడప, చిత్తూరు, తిరుపతి అర్బన్‌ జిల్లాలలో మొత్తం 49 కేసులను పోలీసులు నమోదు చేశారు. 

ఎర్రచందనం అక్రమ రవాణాలో సయ్యద్‌ ముజీబ్‌ భాయ్‌ అలియాస్‌ మూస అక్రమంగా కూడబెట్టిన స్థిర,చరాస్తుల వివరాలు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌లలో మిగిలిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు విచారణలో రాబట్టాల్సి ఉంది. 

ముజీబ్‌భాయ్‌ అలియాస్‌ మూసాకు ప్రధాన అనుచరుడైన మహమ్మద్‌ గయాజ్‌ అహ్మద్‌ బెంగళూరు సిటీ, కీల్‌కొట్టాల్‌లో నివసిస్తూ ఎనిమిది సంవత్సరాలుగా ముజీబ్‌భాయ్‌ ఎర్రచందనం అక్రమ రవాణా కార్యకలాపాల్లో సహాయ సహకారాలు అందించేవాడు. ఇతనిపై తిరుపతి అర్బన్‌ జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి.

చిత్తూరు జిల్లా పీలేరు మండలం సూరప్పగారిపల్లెకు చెందిన గొంగన లీలాకుమార్‌ పదవ తరగతి వరకు చదువుకుని ఆ తర్వాత అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ ముజీబ్‌భాయ్‌ అనుచరుడిగా మారాడు.  కూలీలను సమకూర్చుకుని జిల్లాలోని రిజర్వు అటవీ ప్రాంతాలలో ఎర్రచందనం చెట్లను నరికించి వాటిని దుంగలుగా తయారు చేయించి ముజీబ్‌ భాయ్‌ ఏర్పాటు చేసిన వాహనాలలో బెంగళూరుకు అక్రమ రవాణా చేసి అతనికి అప్పగించేవాడు.

మరిన్ని వార్తలు