అసెంబ్లీలోకి ఆగంతకుడు

31 Jul, 2014 02:36 IST|Sakshi
అసెంబ్లీలోకి ఆగంతకుడు

* ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం ధ్వంసం
* సాయుధ పహరా కళ్లుగప్పి.. గేటు దూకి వెళ్లిన అశోక్‌రెడ్డి
* ప్రవేశ ద్వారం తలుపులు ముక్కలు ముక్కలు చేసిన వైనం
* ఆగంతకుడిని వాచ్‌మన్లు గుర్తించటంతో అప్రమత్తం.. అరెస్ట్
* అశోక్‌రెడ్డికి మతి స్థిమితం లేదని చెప్తున్న కుటుంబసభ్యులు
* ఘటనపై దర్యాప్తు - శాసనసభ భద్రత మరింత కట్టుదిట్టం

 
సాక్షి, హైదరాబాద్: నిరంతరం మూడంచెల సాయుధ పోలీసులు పహరా ఉండే అసెంబ్లీ భవనంలోకి ఒక అగంతకుడు ప్రవేశించి ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఘటన అనంతరం స్పందించిన పోలీసులు ఆ అగంతకుడిని పట్టుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా పస్రకు చెందిన అశోక్‌రెడ్డి అనే వ్యక్తి.. అత్యంత పటిష్టమైన భద్రత మధ్య ఉండే అసెంబ్లీ భవనంలోకి ఆరు అడుగులకు పైగా ఎత్తుండే ఒకటో నంబరు గేటు ఎక్కి ప్రవేశించాడు. ఈ గేటు వద్ద 24 గంటలూ సాయుధ పోలీసులు పహరాకాస్తుంటారు.
 
 అక్కడి నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభ కార్యదర్శులు తమ కార్యాలయాల్లోకి ప్రవేశించే ప్రధాన ద్వారం గేటు తెరుచుకుని.. లోపలకు వెళ్లి ఎమ్మెల్యేల ప్రవేశద్వారాన్ని ధ్వంసం చేశాడు. అశోక్‌రెడ్డి దెబ్బకు కలపతో చేసిన ఆ ద్వారంలోని రెండు తలుపుల్లో ఒకటి ముక్కలు ముక్కలై నేలపై పడింది. ఆ ద్వారానికి ఉండే అద్దం కూడా ధ్వంసమైంది. ధ్వంసమైన ద్వారం గుండా సమావేశ మందిరంలోకి ప్రవేశించిన అశోక్‌రెడ్డి కొద్దిసేపు అక్కడి ఉండి ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర మంత్రుల ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లి కూర్చున్నాడు. ఈ సమయంలో గమనించిన అసెంబ్లీ వాచ్‌మన్లు అతడిని ప్రశ్నించే సరికి పొంతన లేని సమాధానాలివ్వడంతో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్‌కు సమాచారం అందించారు. ఆయన హైదరాబాద్ నగర పోలీసులకు సమాచారం అందించారు.
 
  సెంట్రల్ జోన్ డీసీపీ వి.బి.కమలాసన్‌రెడ్డి అసెంబ్లీకి చేరుకుని ద్వారం ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనకు పాల్పడిన అశోక్‌రెడ్డిని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ గౌరీనగర్‌లో నివాసం ఉంటున్న అశోక్‌రెడ్డి పూర్వాపరాలను ఆయన భార్యను విచారించి తెలుసుకున్నారు. ఆ తరువాత డీసీపీ మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అశోక్‌రెడ్డి మానసికస్థితి బాగోలేదని, బుధవారం ఉదయం ఐదు గంటల సమయంలో ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు చెప్పారని వివరించారు. అశోక్‌రెడ్డి ఒకటో నంబరు గేటు నుంచి అసెంబ్లీ భవన సముదాయంలోకి ప్రవేశించినట్లు సీసీ టీవీలో రికార్డైందని వివరించారు. అశోక్‌రెడ్డిపై 447, 427 పబ్లిక్ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు నమోదుచేసినట్లు సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ పగడాల అశోక్ చెప్పారు.  ఘటన అనంతరం అసెంబ్లీ ఆవరణలో భ ద్రత కట్టుదిట్టం చేశారు. ధ్వంసమైన ద్వారాన్ని పరిశీలించే ందుకు ఎవరినీ అనుమతించలేదు.
 
 అసెంబ్లీ సమావేశ మందిరానికి మరమ్మతులు
 టేకుతో తయారైన ద్వారాన్ని ఎలాంటి పరికర సాయం లేకుండా ధ్వంసం చేయటం సాధ్యమయ్యే పనికాదు. ఒకవేళ అశోక్‌రెడ్డి మానసిక వికలాంగుడై కాళ్లు లేదా చేతులతో తన్ని ద్వారాన్ని ధ్వంసం చేశారని అనుకున్నా ఆయన శరీరంపై ఎలాంటి గాయా లు లేవు. ఆ సమయంలో శబ్దం కూడా రాలేదు. ప్రస్తుతం సమావేశ మందిరంలో మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో అందుకు ఉపయోగించే సామాగ్రిని ఏమైనా ఉపయోగించారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలావుంటే సంఘటన గురించి అసెంబ్లీ అధికారులు విదేశీ పర్యటనలో ఉన్న స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు వివరించినట్లు సమాచారం. ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ ఘటనకు కారకులుగా భావిస్తూ నలుగురు ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

మరిన్ని వార్తలు