పరిమళించిన మానవత్వం

7 Apr, 2018 12:16 IST|Sakshi
అవ్వకు సపర్యలు చేస్తున్న శ్రీనివాస్‌

అనాథను అక్కున చేర్చుకున్న అల్లూరి శ్రీనివాస్‌

సపర్యలతో కోలుకుంటున్న  అవ్వ ఆరోగ్యం

రాయవరం (మండపేట):  రోడ్డు పక్కన అత్యంత దయనీయ స్థితిలో పడి ఉన్న ఆ అవ్వను మానవత్వం పరిమళించిన ఓ వ్యక్తి ఆ  అక్కున చేర్చుకున్నాడు. వైద్య పరీక్షలు చేయించి అనంతరం రాయవరం మండలం లొల్ల గ్రామంలోని మానవత ఆశ్రమానికి తీసుకుని వచ్చి, ఆమెకు రక్షణ కల్పించారు.

మానవతా సేవలతో..
రాయవరం మండలం లొల్ల గ్రామానికి చెందిన అల్లూరి శ్రీనివాస్‌   విశ్వమానవతా స్వచ్ఛంద సంస్థను 1991లో స్థాపించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేసి నిరాదరణకు గురైన వారిని, పేదలను అక్కున చేర్చుకుంటున్నారు. నిరుపేద చిన్నారులకు భోజన వసతి కల్పించి, వారికి చదువు నేర్పిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి లొల్ల వచ్చే క్రమంలో శ్రీనివాస్‌ గురువారం సామర్లకోట రైల్వేస్టేషన్‌లో దిగారు. స్టేషన్‌ బయట అనాథలా రోడ్డు పక్కన పడి ఉన్న వృద్ధురాలిని చూసి చలించిపోయారు. వెంటనే ఆమెకు అల్పాహారం, మంచినీరు తాగించారు. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్లి వైద్యం చేయించారు.

వైద్యం చేయించడానికి ముందుగా దారుణమైన స్థితిలో ఉన్న ఆమెకు స్నానం చేయించి శుభ్రం చేశారు. వైద్య సహాయం అనంతరం లొల్లలోని విశ్వ మానవతా ఆశ్రమానికి తీసుకు వచ్చారు. ఆమె ఏమి మాట్లాడుతుందో అర్థం కావడం లేదు. తనను ఎవరో కొట్టినట్టుగా సైగల ద్వారా చెబుతోంది.  ఆమె వద్ద ఉన్న డబ్బులు, బంగారం కాజేసి రైల్వే స్టేషన్‌ వద్ద వదిలి వెళ్లి పోయి ఉంటారని ఆమె చేస్తున్న సైగలను బట్టి అర్ధమవుతోంది. వచ్చినప్పటి కంటే ఇప్పుడు ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడినట్టు శ్రీనివాస్‌ తెలిపారు. అనాథ మహిళకు ఆశ్రయం కల్పించినట్టుగా రాయవరం పోలీస్టేషన్‌కు సమాచారమిచ్చామని ఆయన పేర్కొన్నారు. ఆమెకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే విశ్వమానవతా ఆశ్రమానికి వచ్చి తీసుకుని వెళ్లవచ్చని చెప్పారు. 

మరిన్ని వార్తలు