బాకీ తీర్చమన్నందుకు..

21 Jun, 2018 09:20 IST|Sakshi

అర్ధరాత్రి మహిళపై   మామ, అల్లుడి హత్యాయత్నం

 కొనూపిరితో ఉన్న బాధితురాలిని గుర్తించిన స్థానికుడు

ఒంగోలు తాలూకా పోలీసులకు సమాచారం

 రిమ్స్‌కు తరలింపు 

ఒంగోలు: బాకీ తీరుస్తామంటూ ఓ మహిళను మామ, అల్లుడు నమ్మకంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానిక రామ్‌నగర్‌ పదో లైనులో రైల్వేట్రాక్‌ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. షేక్‌ లక్ష్మిది తాళ్లూరు మండలం కొత్తపాలెం. ఈమె కొన్నాళ్ల క్రితం అదే మండలం మన్నేపల్లికి చెందిన లక్కుల వెంకారెడ్డికి రూ.4 లక్షలు అప్పు ఇచ్చింది. ఏళ్లు గడుస్తున్నా ఆయన బాకీ తీర్చలేదు. అంతేకాకుండా అతడు స్వగ్రామంలో కాకుండా తన మామగారి ఊరైన చినగంజాం మండలం రాజుబంగారుపాలెంలో నివాసం ఉంటున్నాడు.

 విషయం తెలుసుకున్న లక్ష్మి.. నేరుగా అక్కడకు వెళ్లి తన బాకీ తీర్చాలని వెంకారెడ్డిని కోరింది. అతడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టులో కేసు మంగళవారం విచారణకు వచ్చింది. బాధితురాలు లక్ష్మి కోర్టుకు హాజరైంది. తమతో వస్తే బాకీ డబ్బులు ఇస్తామంటూ వెంకారెడ్డి, అతని మామ మంచాల వెంకటేశ్వరరెడ్డి అలియాస్‌ బాబుల్‌రెడ్డిలు ఆమెను నమ్మబలికారు. ఇద్దరూ కలిసి రాత్రి 7 గంటల సమయంలో ఆమెను రామ్‌నగర్‌ పదో లైనులోని రైల్వేట్రాక్‌ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై ఇనుపరాడ్డు, బండరాయితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆమె చున్నీతో మెడకు బిగించారు. 

చనిపోయిందని భావించి అక్కడి నుంచి పరారయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో ఆ దారిన వెళ్తున్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలతో లక్ష్మి కనిపించింది. అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలిని చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. డబ్బులు ఇస్తామంటూ నమ్మకంగా తీసుకెళ్లి హత్య చేయాలని పథకం పన్నిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు