దా‘రుణ’ మోసం

28 Dec, 2019 11:46 IST|Sakshi
గతంలో ఆన్‌లైన్‌లో 13 ఎకరాల పొలం ఉన్నట్లు చూపుతున్న దృశ్యం

భూమి లేకున్నా రికార్డుల సృష్టి

పత్తికొండ కేడీసీసీ బ్యాంకులో రుణం

కంతులు చెల్లించకపోవడంతో మేల్కొన్న బ్యాంకు అధికారులు  

కర్నూలు, డోన్‌: ప్రభుత్వ నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని బ్యాంకుల్లో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న ఘనులు రోజుకోకకరు బయట పడుతూనే ఉన్నారు. మండలంలోని యాపదిన్నె మజారా మల్యాల గ్రామంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగుచూసింది. చనుగొండ్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. మల్యాల గ్రామానికి చెందిన కుందర్తి సంజీవులుకు సబ్సిడీ రుణం ఇప్పిస్తానని నమ్మబలికాడు. రూ.లక్ష రుణం తీసుకొని తలా రూ.50 వేలు తీసుకుందామని, నువ్వు తీసుకున్న రుణం సబ్సిడీ కింద పోగా, మిగతాది తానే చెల్లిస్తానని చనుగొండ్ల వ్యక్తి నమ్మించాడు. 815/1 సర్వే నంబర్‌లో సెంటు భూమి లేకపోయినా సంజీవులుకు 13 ఎకరాలు పొలం ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు సృష్టించాడు. వాటిని పత్తికొండ కేడీసీసీ బ్యాంక్‌లో పెట్టి 2018 ఫిబ్రవరి 21న రూ.9,75,000 రుణం తీసుకున్నాడు. సంజీవుడిని మాత్రం రూ.50 వేలు చేతిలో పెట్టి మిగతాది స్వాహా చేశాడు. 

డొంక కదిలింది ఇలా..
సర్వీస్‌ ఏరియా కాకపోయినా సంజీవునికి ఉదారంగా రుణం ఇచ్చిన పత్తికొండ కేడీసీసీ బ్యాంక్‌ అధికారులు వాయిదాలు చెల్లించకపోవడంతో ఈ ఏడాది మే 19న నోటీసులు జారీ చేశారు. దీంతో సంజీవుడు లబోదిబో మంటున్నాడు. తనకు ఇచ్చింది కేవలం రూ.50వేలు మాత్రమేనని మిగిలిన రూ.9,25,000 చనుగొండ్లకు చెందిన ఓ వ్యక్తి స్వాహా చేశాడని సంజీవుడు ఆరోపిస్తున్నాడు. 

ఆన్‌లైన్‌లో మాయం
రుణం ఇచ్చే సందర్భంలో ఆన్‌లైన్‌లో కన్పించిన పొలం వివరాలు ప్రస్తుతం మాయం కావడంతో బ్యాంక్‌ అధికారులు నివ్వెరపోతున్నారు. సెంటు స్థలం లేని వ్యక్తి నుంచి రుణం ఎలా కట్టించుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో పడిపోయారు. 

ఎందరో బలి పశువులు..
సంజీవుడు లాంటి వ్యక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకొని కొందరు రెవెన్యూ, బ్యాంక్‌ అధికారులకు మామూళ్లు ఎరచూపి లక్షలాది రూపాయలను రుణాల కింద దిగమింగుతున్న పెద్దల భరతం పట్టేందుకు  ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అంశంపై అలసత్వం వహిస్తే సంజీవుడు లాంటి మరెందరో బలిపశువులు కావాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా