మానవత్వమా నీవెక్కడ?

2 Jun, 2018 13:23 IST|Sakshi
కోమాలో ఉన్న తండ్రి దగ్గర ఉన్న రెండేళ్ల చిన్నారిని దగ్గరకు తీసుకుంటున్న బీవీ సాగర్‌

మూడు రోజుల నుంచి కోమాలో ఉన్న భర్త

అచేతనంగా ఉన్న భర్త, రెండేళ్ల చిన్నారితో కలెక్టరేట్‌ ఫుట్‌పాత్‌పైనే జీవనం

భిక్షాటనకు వెళ్లిన తల్లి..తండ్రి కోసం చిన్నారి తాపత్రయం

రెండేళ్ల శిశువుని శిశుగృహకు తరలించిన చైల్డ్‌లైన్‌

ఒంగోలు టౌన్‌: ఊరుగాని ఊరు. నా అని పలకరించేవారు లేరు. ఒక్కసారిగా ఆమె భర్త ఆరోగ్యం క్షీణించింది. రిమ్స్‌లో చేర్పిస్తే.. ఇరవై రోజులు చికిత్స చేసి చేతులెత్తేసి తీసుకువెళ్లాలంటూ చెప్పారు. ఎటు వెళ్లాలో తెలియక నాలుగు రోజుల నుంచి కలెక్టరేట్‌లోని ఫుట్‌పాత్‌పైనే భర్తను పడుకోబెట్టి రెండేళ్ల బిడ్డను ఎత్తుకొని భిక్షాటనకు వెళుతోందా తల్లి. మొదటిరోజు కొంచెం కళ్లు తెరిచి చూసినా మూడు రోజుల నుంచి పూర్తిగా కోమాలోనే ఉన్నాడు. నిత్యం జన సంచారంతో రద్దీగా ఉండే కలెక్టరేట్‌ వద్ద ఇలా మూడు రోజులుగా ఓ వ్యక్తి అచేతనంగా పడిఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. శుక్రవారం పరిస్థితి మరింత విషమించింది. భర్త చనిపోయాడనుకుని దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో భిక్షాటన కోసం అతని భార్య వెళ్లింది. తోడుగా ఉంటున్న మామ తాగునీటి కోసం వెళ్లాడు. ఆ సమయంలో రెండేళ్ల చిన్నారి తన తండ్రి తల, చేతులను పట్టుకొని అటూ ఇటూ కదిలిస్తున్నాడు.

సమీపంలో ఉన్న మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని గమనించి  1098కు సమాచారం ఇచ్చారు. హెల్ప్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ బీవీ సాగర్, చైల్డ్‌లైన్‌ ప్రతినిధి డి.దేవకుమారి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కోమాలో ఉన్న వ్యక్తిని లేపేందుకు ప్రయత్నిస్తే ఎలాంటి చలనం లేదు. రెండేళ్ల చిన్నారిని ఎత్తుకొని కొద్దిసేపు ఇటూ ఇటూ చూశారు. చివరకు ఆ బిడ్డ తల్లి వచ్చింది. తన దీనగాథను వారి వద్ద వెళ్లబోసుకుంది. తన పేరు నీలం అనూష అని, తన భర్త పేరు దుర్గాప్రసాద్‌ అని చెప్పింది. రాజమండ్రిలోని మండపేటలో ఉంటున్న తాము ఐదారేళ్ల క్రితం కాగితాలు ఏరుకుంటూ ఒంగోలు వచ్చామని తెలిపింది. ‘ఇక్కడ నా అనేవారు లేకపోయినా నా భర్త, రెండేళ్ల కుమారుడు, మామతో కలిసి ఫుట్‌పాత్‌పైనే ఉంటున్నాం.

భర్త మద్యం దుకాణంలో పనిచేశాడు. నేను కాగితాలు ఏరుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. నా భర్త లివర్, గుండె చెడిపోవడంతో ఇరవై రోజుల క్రితం రిమ్స్‌ హాస్పిటల్‌లో చేర్పించాను. నాలుగు రోజుల క్రితం ఇక బతకడు తీసుకువెళ్లమంటే, కలెక్టరేట్‌ ఫుట్‌పాత్‌పైనే పడుకోబెట్టా...మూడు రోజుల నుంచి నా భర్తను పిలిచినా పలకడం లేదు..  కదలడం లేదు..’ అంటూ కన్నీళ్ల పర్యంతమైంది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో భిక్షాటన కోసం వెళ్లానని అనూష తెలిపింది. స్పందించిన సాగర్‌ తన వద్ద ఉన్న రూ.500 ఇచ్చి..రెండేళ్ల చిన్నారిని బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరచిన అనంతరం శిశుగృహలో చేర్పించాడు. సాయంత్రం ఆరుగంటల    సమయంలో కూడా దుర్గాప్రసాద్‌ కోమాలోనే ఉన్నాడు.

మరిన్ని వార్తలు