ఎంపీ గీత చొరవతో సౌదీ నుంచి సొంతింటికి

11 Mar, 2020 08:38 IST|Sakshi
కాకినాడ ఎంపీ వంగా గీతను కలిసిన ‘ధారకొండ’ కుటుంబ సభ్యులు

ఐదేళ్లుగా ఇబ్బందులు 

ఎంపీ గీత చొరవతో స్వదేశానికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం

సాక్షి, కాకినాడ: కుటుంబపోషణ కోసం దేశంకాని దేశం వెళ్లి నరకయాతన అనుభవించాడు. బాధ చెప్పుకునే దిక్కులేక ఇబ్బందుల నుంచి బయటపడే దారిలేక నరకాన్ని చవిచూశాడు. కనీసం కుటుంబ సభ్యులతో కూడా సంబంధాలు తెగిపోవడంతో అతను అనుభవించిన నరకం అంతా, ఇంతా కాదు. అలాంటి కుటుంబానికి కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌ తీసుకున్న చొరవ ఊరటనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే తుని నియోజకవర్గం తొండంగి మండలం ఏవీ నగరానికి చెందిన దిమ్మల ధారకొండ ఉద్యోగం కోసం పాతికేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు.

కొన్నేళ్ల పాటు ఉద్యోగం సాఫీగానే సాగినా ఐదేళ్లుగా జీతం అందక, పోషణ కూడా భారం కావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. జీతం కోసం యజమానితో గొడవ పడడం అతనిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. చివరకు యజమాని ఫిర్యాదుతో పోలీసు కేసులో ఇరుక్కుని సౌదీలోనే బందీగా మారాడు. కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా లేకపోయింది. ఎక్కడ ఉన్నారో? ఎలా ఉన్నారో? తెలియని పరిస్థితుల్లో ‘ధారకొండ’ కోసం ఆయన కుటుంబ సభ్యులు ఎంపీ వంగా గీతను కలిశారు.

ఆమె కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌ ద్వారా సౌదీలోని ఎంబసీ అధికారులతో పలుసార్లు సంప్రదింపులు జరిపారు. ఎంపీ కృషికి ఫలితం దక్కి కొద్దిరోజుల క్రితమే ధారకొండ స్వదేశానికి చేరుకున్నాడు. తీవ్ర అనారోగ్యంతో ఇక్కడకు వచ్చిన అతను చికిత్స చేయించుకున్న అనంతరం కుటుంబంతో సహా మంగళవారం కాకినాడలో ఎంపీ వంగా గీతను ఆమె కార్యాలయంలో కలుసుకున్నారు. ఎంపీ చొరవ తీసుకోకపోయి ఉంటే తమ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉండేదో అన్నాడు. ఆ కుటుంబం ఎంపీ గీతకు కృతజ్ఞతలు తెలిపింది. ఎంపీ చొరవ వల్లే ధారకొండ స్వస్థలానికి వచ్చారంటూ ఆ కుటుంబం ఎంతో సంబరపడుతూ చెప్పింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు