పరిగి వాసి బెంగళూరులో ఆత్మహత్య

25 Dec, 2018 11:26 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న హసీబ్‌ బాషా(ఫైల్‌ ఫొటో)

నమ్మించిమోసం చేసిన స్నేహితుడు    

ఎట్టిపరిస్థితుల్లో వాడిని శిక్షించాలని వేడుకోలు    

వైఎస్‌ జగనన్న సీఎం అవుతారని స్పష్టం    

ఆత్మహత్యకు ముందు హాసీబ్‌ వీడియో రికార్డు    

సంచలనం రేపిన ఆత్మహత్య

అనంతపురం  ,పరిగి: పరిగి మండలం కొడిగెనహళ్లికి చెందిన హాసీబ్‌బాషా(28) ఆదివారం కర్ణాటకలోని బెంగళూరులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం అదే రోజు రాత్రి పలు వాట్సాప్‌ గ్రూపుల్లో హల్‌చల్‌ చేసి చూసిన వారందరినీ కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. కొడిగెనహళ్లి గ్రామంలో నివాసముంటున్న కార్పెంటర్‌ అన్వర్‌ రెండవ కుమారుడు హసీబ్‌ ద్విచక్రవాహన మెకానిక్‌. కొన్నాళ్లు గ్రామంలోని తన ఇంటి పక్కనే పని చేసుకుంటూ ఏడేళ్ల క్రితం బెంగళూరులో షాపు పెట్టాడు. ఈ క్రమంలో అక్కడ పరిచయమైన ఓ మిత్రుని కారణంగా నష్టపోయినట్లు హసీబ్‌ ఆదివారం ఉదయం బెంగళూరులోని తన రూంలో వీడియో రికార్డు చేసి తరువాత తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆ వివరాలు యథాతథంగా..
‘‘నాది ఆంద్రప్రదేశ్‌. అనంతపురం జిల్లా హిందూపురం పక్కనున్న పరిగి మండలంలోని కొడిగెనహళ్లి. గత ఏడు సంవత్సరాలుగా బెంగళూరులో ఉంటున్నా. నేను చాలా కష్టపడినాను. ఒక అంగడి బాడుగకు తీసుకుని నడిపాను. ఐదేళ్లుగా బిజినెస్‌ బాగా జరిగింది. మధ్యలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తర్వాత కాలంలో బాగా నన్ను ఇబ్బందులకు గురిచేశాడు. అంగడి తీసేయమని, నీకు వేరే దారి చూపిస్తానని నమ్మబలికాడు. అలాగే నా జతలో వచ్చేయి.. నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలపడంతో నాకు నమ్మకం కలగలేదు. ఎక్కువగా ఒత్తిడి చేసి చివరకు దుకాణం బంద్‌ చేయించాడు. మాయమాటలు చెప్పి షాపు మూయించేదాకా నన్ను వదల్లేదు. తరువాత కొంతకాలం గడిచింది. ఇక నన్ను పట్టించుకోవడం మానేశాడు.

ఏదో పని చూపిస్తానని చెప్పావు కదా.. నాకేదైనా దారి చూపించమని ప్రాధేయపడ్డాను. చివరకు నేనే బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్లో పనిలో చేరాను. అక్కడికి వెళ్లి రావడానికి ఎంతో వ్యయప్రయాసలకు లోనయ్యా. కడుపు నిండితే చాలని కష్టాలను ఎదుర్కొన్నాను. నేనున్న ఇంటి ఓనర్‌ చాలా మంచి వ్యక్తి. నాకు ఆర్థికంగా ఎంతో సపోర్టు ఇచ్చారు. రూ.1.20 లక్షలు ఓనరుకు బాకీ పడ్డాను. నేను ఆత్మహత్య చేసుకున్నాక ఇంటి ఓనరుకు కచ్చితంగా నాబాకీ ఇచ్చేయమని ప్రాధేయపడుతున్నా. నాకు ఇబ్బందులు పెట్టి నా జీవితాన్ని నాశనం చేసిన మహేష్‌ అనే వ్యక్తిని ఎట్టిపరిస్థితిల్లోనూ వదలొద్దు. శిక్షించాలి. సర్జాపూర్‌లో పెద్ద మనుషులు ఉన్నారు. అందులో సద్దాం, కటింగ్‌ శీనా ఓం శక్తి మంజు మిగిలిన మా కుల పెద్దలు ఉన్నారు. వారంతా నాకు తోడుగా నిలవాలని కోరుతున్నా. బెంగళూరులోనే అతి పెద్ద మనిషిగా ఉన్న జమీర్‌ అన్నను రిక్వెస్ట్‌ చేస్తున్నా.. నాకు మోసం చేసిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. మిగిలిన వారంతా నాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు. నాకు కర్ణాటకలో జమీర్‌ అన్న.. ఆంధ్ర లో వైఎస్‌ జగనన్న అంటే ప్రాణం..(నవ్వుతూ)..

జగనన్న సీఎం అవడం ఖాయం..
ఆంధ్రలో ఈసారి వైఎస్‌ జగనన్న సీఎం కావడం గ్యారెంటీ. ఆయనంటే నాకు అమితమైన ఇష్టం. జగనన్న ఒక్కసారి సీఎం అయితే ప్రతి పిల్లోడి నుంచీ ముసలివాళ్ల వరకూ జీవితాలు బాగుపడతాయి. ఎంతో నమ్మకంగా పాలన అందిస్తారనుకుంటున్నా. మా తల్లిదండ్రులు నాకేమి లోటు చేయలేదు. వారి గురించి ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు. వారికి చాలా దుఃఖం కలిగించాను. వారిని అనేక ఇబ్బందులు పెట్టాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. ప్రతి ఒక్కరికీ డౌట్‌ రావచ్చు. నా గురించి ఎవరినీ ఇబ్బందులు పెట్టొద్దండి. కానీ ఆ ఒక్కడిని మాత్రం వదలొద్దండి. వాడికి శిక్ష పడాలి. మహేష్‌ అనే వాడి ఫొటో, సెల్‌ ఫోన్‌ నెంబరును ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నా. 10–15 నిమిషాల్లో ఆత్మహత్య చేసుకోబోతున్నా. నాకు మాటలు రావడం లేదు. డబ్బుకోసం చనిపోతున్నాడని భావించకండి. మనిషి డబ్బును సంపాదిస్తాడు.. కానీ డబ్బు మనిషిని సంపాదించలేదు.’’ 

మరిన్ని వార్తలు