పోలీస్‌ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం

14 Dec, 2018 13:34 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాజుల స్వామి

పోలీసుల వైఖరికి మనస్తాపం చెంది అఘాయిత్యం

ఆస్పత్రికి తరలింపు

విచారణ చేపట్టిన సీఐ

గూడూరు(పెడన): పోలీసులు తీరుకు నిరసనగా పోలీసు స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

పోలీసుల వైఖరితోనే..
దివి తాలూకా పిట్లలంకకు చెందిన నందినిని వరసకు మేనమామ అయ్యే గూడూరుకు చెందిన అల్లం అయ్యప్పకు ఇచ్చి గత ఏప్రిల్‌లో వివాహం చేశారు. అయ్యప్ప రెండు నెలలకే నందినిని వదిలేసి, వేరొక యువతితో పరారయ్యాడు. దీంతో నందిని తన భర్త కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గూడూరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. అయితే ఎస్‌ఐ ఆమె ఫిర్యాదు తీసుకోలేదు. అప్పటికే అయ్యప్ప తీసుకెళ్లిన యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు నమోదైనందున నీ ఫిర్యాదు తీసుకోలేమంటూ ఎస్‌ఐ కేసు స్వీకరించడానికి నిరాకరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రెండురోజుల క్రితం అయ్యప్ప బంధువులు చనిపోగా.. అంత్యక్రియలకు హాజరుకావడానికి అతడు వచ్చాడు. దీంతో నందిని, ఆమె బంధువులు కలసి గూడూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అయ్యప్పను అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రి 12 గంటల వరకు పోలీసుల సమక్షంలో పంచాయితీ చేశారు. మరుసటి రోజు మాట్లాడుకుందామని అయ్యప్పను వదలవద్దని నందిని తరఫు వారు పోలీసులను కోరారు. అయితే నందిని బం«ధువులు వెళ్లిపోయిన తరువాత పోలీసులు అయ్యప్పను వదిలిపెట్టడంతో వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న నందిని సోదరుడు స్వామి పురుగు మందు తీసుకుని పోలీసుస్టేషన్‌కు వచ్చి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్పందించిన పోలీసులు పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం బందరు ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల వైఖరిపై దర్యాప్తు:బి.బి.రవికుమార్, బందరు రూరల్‌ సీఐ
పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో గాజుల స్వామి పురుగుమందు తాగిన ఘటనలో పోలీసుల వైఖరిపై విచారణ జరుపుతున్నాం. విచారణలో పోలీసుల వైఖరి కారణమని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లం అయ్యప్పపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు