కోళ్లమేత వేద్దామని వెళ్లి కానరాని లోకాలకు..

5 Oct, 2017 07:10 IST|Sakshi
కవురు నాగరాజు మృతదేహం వద్ద విలపిస్తున్న భార్య, కుమార్తెలు

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

తెలుగుపాలెంలో విషాదఛాయలు

పశ్చిమగోదావరి, పోడూరు: కోళ్లకు మేత వేద్దామని వెళ్లిన వ్యక్తి పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పెనుమదం శివారు తెలు గుపాలెంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో అదే ప్రాంతానికి చెందిన కవురు నాగరాజు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు కుటుంబసభ్యులతో కలిసి గ్రా మంలోని ఓ తాటాకింట్లో నివాసముంటున్నాడు. ఇటీవల ఈ ఇల్లు పాడవడంతో సమీపంలోని మరో ఇంట్లోకి మారాడు. పాత ఇంటి వద్ద కోళ్లు మేపుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జోరుగా వర్షం కురుస్తుండగా కోళ్లకు మేత వేసేందుకు పాత ఇంటికి వెళ్లాడు. ఇంటి పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు కింద నిలబడి ఉండగా చెట్టుపై పిడుగు పడింది. దీంతో నాగరాజు అక్కడికక్కడే కన్నుమూశాడు. భారీ శబ్దంతో పిడుగు పడటంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిడుగు పడిన కొబ్బరిచెట్టు మా ను సగభాగం నుంచి కిందకు నాలుగు అంగుళాల లోతున చీరుకుపోయింది.

ఇప్పుడే వస్తానని వెళ్లి..
నాగరాజు కోళ్లకు మేత వేయడానికి వెళ్లే ముందు అదే ప్రాంతంలో ఉంటున్న తల్లి నాగరత్నం ఇంటికి వెళ్లాడు. నాగరాజు బయటకు వెళుతుండగా టీ తాగి వెళుదువు.. కొద్దిసేపు ఆగమని తల్లి చెప్పినా వినకుండా ఇప్పుడే వస్తానని బయటకు వెళ్లాడు. తనమాట విని ఆగిఉంటే ప్రమా దం తప్పేదని తల్లి నాగరత్నం బోరుమంది.

విషాదఛాయలు
ఊహించని రీతిలో పిడుగుపాటుకు నాగరాజు బలికావడంతో తెలుగుపాలెంలో విషాదం నెలకొంది. నాగరాజుది పేద కుటుంబం. కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి భార్య లక్ష్మి, 11, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు మృతదేహం వద్ద భార్య, తల్లి, కుమార్తెల రోదనలు మిన్నంటాయి. తహసీల్దార్‌ కె.శ్రీరమ ణి, ఎస్సై కె.రామకృష్ణ సంఘటనా స్థలా నికి వచ్చి నాగరాజు మృతి చెందిన తీ రును పరిశీలించారు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహానికి పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

తప్పిన పెనుప్రమాదం
తెలుగుపాలెంలో రామాలయం వద్ద ఇటీవల దేవీ నవరాత్రుల వేడుకలు ముగిశాయి. మృతుడు నాగరాజు పాత ఇల్లు రామాలయం ఎదురుగానే ఉంది. బుధవారం ఉదయం ఇక్కడ టెంట్లు, కుర్చీలు, బల్లలు తొలగిస్తున్నారు. పిడుగుపడిన కొబ్బరిచెట్టు కిందే కొన్ని బల్లలు ఉన్నాయి. అయితే పిడుగు పడటానికి కొద్ది నిమిషాల ముందే ఆరుగురు కూలీలు అక్కడున్న బల్లలను, కుర్చీలను వ్యానులో ఎక్కించి తరలించారు. కూలీలు అక్కడే ఉండి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు