కబళించిన సముద్రం

4 Feb, 2019 13:32 IST|Sakshi
ఒడ్డుకు చేరుస్తున్న మెరైన్‌ పోలీసులు

ఒక వ్యక్తి మృతి

ముగ్గుర్ని ప్రాణాలతో కాపాడిన మెరైన్‌ పోలీసులు

నెల్లూరు, తోటపల్లిగూడూరు: కోడూరు బీచ్‌లో ఆదివారం సముద్ర స్నానాలు చేస్తూ అలల్లో చిక్కుకున్న నలుగురు సందర్శకులను దుగరాజపట్నం మెరైన్‌ పోలీసులు ప్రాణాలతో రక్షించారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కోడూరు సాగరతీరంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు సముద్ర స్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నగరానికి చెందిన చంద్రశేఖర్, అతని కుమారుడు, మరో ఇద్దరు యువకులు సముద్రంలో అలల తాకిడికి గురై చిక్కుకుపోయారు.

ప్రాణభయంతో కేకలు వేయడంతో బీచ్‌లో గస్తీలో ఉన్న దుగరాజపట్నం మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ చెంచురామయ్య, హెడ్‌కానిస్టేబుల్‌ మోహన్, కానిస్టేబుల్‌ అనిల్, హోంగార్డు వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి అలల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. పోలీసులు రక్షణ కవచాలతో సముద్రంలోకి దూకి ముందుగా గుర్తుతెలియని ఇద్దరు యువకులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం నెల్లూరు నగరానికి చెందిన చంద్రశేఖర్, అతని కుమారుడ్ని రక్షించారు. అయితే చంద్రశేఖర్‌ ఉప్పు నీళ్లు తాగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం పోలీసులు వెంటనే ఓ ప్రత్యేక వాహనంలో నెల్లూరు తరలించారు. సందర్శకుల ప్రాణాలను కాపాడిన మెరైన్‌ పోలీసులను స్థానికులు అభినందించారు.

మరిన్ని వార్తలు