పొట్టకూటికెళ్లి అగ్నికి ఆహుతి

26 Nov, 2018 16:05 IST|Sakshi
విషాదంలో మృతుని తల్లి, సోదరి (ఇన్‌సెట్‌) పిల్లా మోహన్‌ వెంకట అప్పలనాయుడు(ఫైల్‌)

ఇరాన్‌లో షిప్‌లో పనిచేసేందుకు వెళ్లిన సబ్బవరం మండలం ఆరిపాక యువకుడు

గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించడంతో మృతి

కన్నీరుమున్నీరవుతున్న తల్లి, సోదరి

మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చి న్యాయం చేయాలని వేడుకోలు

విశాఖపట్నం, సబ్బవరం(పెందుర్తి): తండ్రి లేని లోటు కనిపించకుండా కుటుంబానికి అండగా నిలవాలని... తల్లిని చక్కగా చూసుకుని, సోదరికి పెళ్లి చేయాలని... పొట్ట చేతపట్టుకుని ఇరాన్‌ వెళ్లిన యువకుడు అగ్నికీలలకు ఆహుతైపోయాడు. తల్లి, సోదరి గుండెల్లో మంటలు నింపాడు. 25 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయా కొడుకా అంటూ ఆ తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేస్తోంది. చేతికందొచ్చిన కొడుకు తనువుచాలించడంతో మాకెవరు దిక్కంటూ భోరున విలిపిస్తున్నారు. ఈ హృదయవిదారకర ఘటనతో సబ్బవరం మండలం ఆరిపాక గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఆరిపాకకు చెందిన పిల్లా మోహన్‌ వెంకట అప్పలనాయుడు(25) చెన్నైలో 2012వ సంవత్సరంలో మెరైన్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. వెంకట అప్పలనాయుడు తండ్రి శ్రీనివాసరావు గతంలో మరణించాడు. ప్రస్తుతం తల్లి భవానీ, వివాహం కాని సోదరి దివ్యకుమారి ఉన్నారు. ఈ నేపథ్యంలో కుంటుంబానికి అండగా నిలిచేందుకు వెంకట అప్పలనాయుడు ఇటీవల ఇరాన్‌కు చెందిన ‘‘ఎరై మాక్రాన్‌ సి’’ అనే కంపెనీలో 9 నెలలు పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఈ సంవత్సరం జూన్‌లో విధుల్లో చేరాడు.

అలారం వినిపించక మంటలకు చిక్కి...
ఈ నేపథ్యంలో ఇరాన్‌ సముద్ర తీరంలో ఆలీ – 20 అనే కార్గో షిప్‌లో 12 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా శుక్రవారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో షిప్‌లో ఉండగా... ఒక ఫ్లోర్‌లో గ్యాస్‌ లీక్‌ కావడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అలారం మోగడంతో 10 మంది సిబ్బంది అప్రమత్తమై వెలుపలికి వచ్చేశారు. షిప్‌ నుంచి దూరంగా వెళ్లిపోయారు. అయితే వెంకట అప్పలనాయుడుతో పాటు హర్యానాకు చెందిన మరో వ్యక్తి చెవులకు ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకోవడంతో అలారం వినిపించక ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. అగ్ని కీలలకు ఆహుతై మృతిచెందారు. మంటలు చల్లారాక షిప్‌ వద్దకు చేరుకున్న మిగిలిన సిబ్బంది ఇద్దరు మృతి చెందిన విషయాన్ని గుర్తించారు.

వారి ద్వారా మరణ వార్తను విశాఖలోని పల్ల మార్కెట్‌లో ఉంటున్న వెంకట అప్పలనాయుడు స్నేహితుడు భార్గవ్‌ తెలుసుకుని ఆరిపాకలోని కుటుంబ సభ్యులకు శనివారం తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు షిప్‌లో పనిచేస్తున్న కురు అనే ఉద్యోగికి ఫోన్‌ చేయడంతో ఆయన అప్పలనాయుడు మరణించినట్లు ధ్రువీకరించారు. దీంతో తల్లి భవానీ, సోదరి దివ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మాకు దిక్కు ఎవరిని గుండెలవిసేలా రోదిస్తున్నారు. గ్రామస్తులంతా వారిని ఓదార్చుతూ మద్దతుగా నిలిచారు. జరిగిన ప్రమాదంపై కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ సాయంతో జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు తెలియజేశారు. భారత దౌత్య కార్యాలయం అధికారులు ప్రమాదంపై స్పందించి తన కుమారుని మృతదేహన్ని అప్పగించడంతో పాటు, తమకు న్యాయం చేయాలని తల్లి, సోదరి వేడుకుంటున్నారు.

>
మరిన్ని వార్తలు