ప్రాణం తీసిన ‘మందు’

25 Oct, 2018 08:15 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న లావేరు ఎస్‌ఐ రామారావు

మద్యం అనుకొని కోళ్లఫారం మందు తాగిన ఇద్దరు వ్యక్తులు

చికిత్స పొందుతూ ఒకరు మృతి

శ్రీకాకుళం, లావేరు: చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. మద్యం అనుకుని కోళ్లఫారం మందు తాగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ దేశిపాలేం గ్రామానికి చెందిన చిట్టిబారికి అప్పయ్య(57) అదే గ్రామంలోని బ్రాయిలర్‌ కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు. ఈ నెల 21న తన పెద్ద కుమారుడు అసిరయ్య ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి తనతో కొన్ని మద్యం బాటిళ్ల(ఇంపీరియల్‌ బ్లూ)ను తెచ్చుకుని కోళ్లఫారంలో భద్రపరుచుకున్నాడు. ఇదిలా ఉండగా, కొద్దిరోజుల కిందటే కోళ్లఫారం కోసం తెచ్చిన మందును కూడా ఇంపీరియల్‌ బ్లూ కంపెనీకి చెందిన ఖాళీ బాటిళ్లలోనే నింపి ఉంచారు. మద్యం, కోళ్లఫారం మందులను ఒకేచోట పెట్టడంతో బాటిళ్లు కలిసిపోయాయి. ఈ నెల 22న అప్పయ్య ఇంటికి లావేరు మండలం చిన్నయ్యపేట గ్రామానికి చెందిన కళావరపు జనార్దనరావు వచ్చాడు. వీరిద్దరూ కలిసి మద్యం తాగడం కోసం కోళ్లఫారానికి వెళ్లారు.

అక్కడ మద్యం అనుకుని కోళ్లఫారం మందు ఉంచిన బాటిళ్లు తీసుకుని తాగేశారు. కొద్దిసేపటికి వాంతులు కావడంతో అప్పయ్య పెద్ద కుమారుడు అసిరయ్య ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాడు. వీరిద్దరూ తాగినది మద్యం కాదని తెలుసుకుని వెంటనే 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అప్పయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం రిమ్స్‌లోనే  మృతి చెందాడు. విషయం తెలుసుకున్న లావేరు స్టేషన్‌ ఎస్‌ఐ సీహెచ్‌ రామారావు, పీసీలు రిమ్స్‌కు వెళ్లి అప్పయ్య మృతదేహాన్ని పరిశీలించారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిర్వహించారు. అప్పయ్య భార్య రాములమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ రామారావు తెలిపారు. అప్పయ్య మృతి చెందడంతో భార్య రాములమ్మ, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న లక్ష్మీపురం మాజీ సర్పంచ్‌ కొల్లి ఈశ్వరరావు మృతుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

మరిన్ని వార్తలు