‘మార్గదర్శి’ వేధింపులకు వ్యక్తి బలి

2 Sep, 2013 05:17 IST|Sakshi

హైదరాబాద్, న్యూస్‌లైన్: మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ వేధింపులకు ఓ వ్యక్తి బలయ్యాడు. ఇంటికి పెద్దదిక్కు మరణించడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. గత కొద్దిరోజులుగా చిట్‌ఫండ్ ప్రతినిధులు ఇల్లును అమ్మి డబ్బు చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి పురుగుల మందు తాగి గత నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆ వివరాలివీ.. కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెద్దరాయుడుతోట గ్రామానికి చెందిన బి.వెంకటసుబ్బారావు (42) పదిహేను సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలో ఫ్యాబ్రికేషన్ వర్క్‌షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన స్నేహితుడు ప్రసాద్ మార్గదర్శి చిట్‌ఫండ్‌లో రూ.10 లక్షల చిట్టీ పాడి తీసుకున్నాడు. దానికి వెంకటసుబ్బారావు జామీనుగా సంతకం చేశాడు.
 
 ఆయనతోపాటు మరో నలుగురు కూడా సంతకాలు చేశారు. ప్రసాద్ 6 నెలల పాటు క్రమం తప్పకుండా నెలవారీ వాయిదాలు చెల్లించాడు. గత రెండేళ్లుగా డబ్బులు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. జామీనుగా ఉన్న మరో నలుగురు కూడా కనిపించకపోవడంతో మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రతినిధులు వెంకటసుబ్బారావుపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో బ్యాంక్ నుంచి రుణం తీసుకొని కూడా సుబ్బారావు కొంత డబ్బు చెల్లించినట్లు ఆయన బంధువులు తెలిపారు. అయినా చిట్‌ఫండ్ ప్రతినిధులు ఇల్లును కోర్టు ద్వారా జప్తు చేస్తామని హెచ్చరికలు చేస్తూ నిత్యం వేధిస్తుండటంతో ఆగస్టు 27న ఉదయం పురుగుల మందు తాగాడు.
 
 అది గమనించిన కుటుంబ సభ్యులు కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సకు లక్ష రూపాయల దాకా ఖర్చు చేశారు. అయినా లాభం లేదని వైద్యులు చెప్పడంతో గత నెల 31న గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి దాటాక రెండున్నర గంటల సమయంలో మృతిచెందాడు. వెంకటసుబ్బారావుకు భార్యతోపాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. చదువుతున్న ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని ఎలా నడిపించాలో అర్థం కాక వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్గదర్శి నుంచి తాము ఎలాంటి రుణం పొందకపోయినా జామీనుగా ఉన్నందుకు ప్రతినిధులు వేధించడం వల్లే సుబ్బారావు ఈ దారుణానికి ఒడిగట్టాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు