కోడిపందేల్లో రివాల్వర్ కాల్పుల కలకలం

13 Jan, 2017 15:11 IST|Sakshi
కోడిపందేల్లో రివాల్వర్ కాల్పుల కలకలం
సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో నిర్వహిస్తున్న కోడి పందేల వద్ద ఓ వ్యక్తి రివాల్వర్‌తో కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. తాడేపల్లిగూడెం మండలం శ్రీనివాసపురం వద్ద ఈ ఘటన జరిగింది. శ్రీనివాసపురం బరి వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. అక్కడ పోటాపోటీగా కోడిపందేలు జరుగుతున్నాయి. బెట్టింగులు కూడా జోరందుకున్నాయి. 
 
ఇంతలో ఖమ్మం జిల్లాకు చెందిన దయాకర్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న లైసెన్సుడు రివాల్వర్‌తో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దాంతో ఏం జరిగిందో తెలియక అంతా కంగారు పడ్డారు. మధ్యాహ్నం సమయంలో పందేలు జరుగుతుండగా ఒక్కసారిగా అతడు కాల్పులు జరపడంతో కాసేపు కలకలం రేగింది. దయాకర్ ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడని తెలిసింది. అయితే ఇంత జరిగినా పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోవడం గానీ, అతడిని అదుపులోకి తీసుకోవడం గానీ జరగలేదు.