గ్రూప్‌1 అధికారిగా రిటైర్డ్‌ అయ్యి..తాను చదివిన పాఠశాలకు..

20 Jul, 2019 13:19 IST|Sakshi
చాగలమర్రి పాఠశాలలో బోరు వేయించిన దృశ్యం

కష్టపడి చదివి.. ఉద్యోగం సాధించి.. కుటుంబం, పిల్లల ఉన్నతికి బాటలు వేసి.. ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంతంగా గడపవచ్చు. అయితే చివరకు వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం ఇంతేనా అనిపించవచ్చు. అందుకే ఆయన ఉన్నత ఉద్యోగం చేసి రిటైర్డ్‌ అయినా ఇప్పటికీ సామాజిక సేవలోనే తరిస్తూనే ఉన్నారు. మంచి మనసుతో చేసే పనితో సమ సమాజ నిర్మాణం సాధ్యమని నిరూపిస్తున్నారు. సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సొంత నిధులు వెచ్చిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. – నంద్యాల 

సాక్షి, కర్నూలు: మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో జన్మించి మొదట ఎస్‌ఐ ఉద్యోగం సాధించి అంచలంచెలుగా ఎదుగుతూ రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిగా, రాష్ట్ర ఇన్‌కంట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన నాగస్వారం నరసింహులు  ఒకటవ తరగతి నుంచి ఎంఏ పీహెచ్‌డీ వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలల్లోనే చదువుకున్నారు. తర్వాత 1983లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం సాధించారు. ఎస్‌ఐగా ఉంటూ ఏపీటీఎస్సీ పరీక్షలు రాసి గ్రూప్‌–2 అధికారిగా ఎంపికయ్యారు.

అనంతరం 1996లో గ్రూప్‌–1 ఉద్యోగం సాధించారు. 2005 నుంచి 2016 వరకు రాష్ట్ర ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌గా, రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిగా కడపలో పని చేసి  ఉద్యోగ విరమణ పొందారు. గతంలో అతను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కనీస వసతులు లేకపోవడంపై నిత్యం తన స్నేహితులతో ఆవేదన వ్యక్తం చేసేవారు. దీంతో రిటైర్డ్‌ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు  ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పాఠశాల సమస్యలపై పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ పరిష్కారానికి చొరవ చూపుతున్నారు.   ఉపాధ్యాయులు, విద్యార్థుల హృదయాల్లో జల ప్రదాతగా పేరు తెచ్చుకున్నారు. 

పదవ తరగతిలో నాలుగుసార్లు ఫెయిల్‌   
తల్లిదండ్రులు తడికెలు, గంపలు అల్లేవారు. వారికి తోడుగా నరసింహులు పని చేస్తూ ఇంటి వద్దనే గడిపేవాడు. ఈ క్రమంలో చదువుపై ఆసక్తి తగ్గింది. దీంతో పదవ తరగతి నాలుగుసార్లు ఫెయిల్‌ అయ్యారు. తర్వాత తల్లిదండ్రుల సూచన మేరకు పట్టుబట్టి పదవ తరగతి పాస్‌ అయ్యారు. అనంతరం ఎస్‌ఐ, గ్రూప్‌–2, గ్రూప్‌–1 స్థానానికి ఎదిగారు. చదువుకుంటున్న సమయంలోనే కళాశాల నుంచి జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ ఆటగాడిగా గుర్తింపు పొందారు. వాటిలో భాగంగా 2014–2016వ సంవత్సరంలో ఇండియా బాస్కెట్‌బాల్‌ టీంకు మేనేజర్‌గా వ్యవహరించారు. థాయిల్యాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, జపాన్‌ వంటి దేశాలకు ఇండియా టీం మేనేజర్‌గా వెళ్లారు.  

సేవతోనే ఆత్మసంతృప్తి 
ప్రభుత్వ పాఠశాలకు, పేద విద్యార్థులకు సేవ చేస్తున్నందుకు ఆత్మసంతృప్తి కలుగుతుంది. మేము చదువుకున్న సమయంలో పాఠశాలల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పటికే దాదాపు 80పాఠశాలల్లో నీటి బోర్లు వేయించి నీటి సమస్యను తీర్చడం చాలా ఆనందంగా ఉంది. టీవీల్లో, పేపర్లలో వచ్చే ప్రభుత్వ పాఠశాల సమస్యలపై స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నాను.  
– నాగస్వారం నరసింహులు, మాజీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి  

సేవా కార్యక్రమాలు.. 
 డిసెంబర్‌ 2017లో చాగలమర్రి జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో బోరు ఏర్పాటు చేశారు. 
⇔ చిలకలడోన కస్తూరిబా గాంధీ పాఠశాల బాలికలకు రూ.40వేలు విలువ గల క్రీడా సామగ్రి అందించారు.   
⇔ పాణ్యం సమీపంలోని కస్తూర్భా గాంధీ పాఠశాలకు రూ.40వేలు విలువ చేసే వంట సామగ్రిని అందజేశారు. 
⇔ ఎర్రగుంట్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.30వేలు చేయూతనిచ్చారు.  
 గోనెగండ్ల కస్తూర్భా గాంధీ పాఠశాలకు రూ.60వేలతో బోరు వేయించి పైపులైన్‌ సౌకర్యం కల్పించారు. 
 దీబగుంట్ల ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులు రికార్డులు భద్రంగా ఉంచేందుకు రూ.25వేల సేఫ్‌లాకర్‌ను అందించారు.   
 కర్నూలు పట్టణంలో ఇద్దరు అనాథలను పిల్లలను దత్తత తీసుకొని వారి చదువుకు అయ్యే ఖర్చులను భరిస్తున్నారు.   
 మాయలూరు జెడ్పీపాఠశాలలో రూ.40 వేలతో బోరు వేయించారు.  
 దిగువపాడు జెడ్పీ హైస్కూల్‌కు రూ.60వేలతో నీటి బోరు వేయించారు.  
 నంద్యాల జెడ్పీ బాలికల పాఠశాలలో రూ.55 వేలతో నీటి  సౌకర్యం.

వెంటనే స్పందించారు
మా పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యపై  పత్రికలో వచ్చిన వార్తకు ఆయన వెంటనే స్పందించి మరుసటి రోజు మా పాఠశాలను సందర్శించారు. పాఠశాలల్లో రూ.50వేలతో నీటి బోరు వేయించి తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులు సమాజంలో చాలా తక్కువగా ఉంటారు.    
– సుబ్బన్న, ఉపాధ్యాయుడు, తిమ్మాపురం  

మరిన్ని వార్తలు