‘నేను స్పెషలాఫీసర్‌ని.. ఇది నా ఐడీ’

9 Jun, 2020 10:23 IST|Sakshi
తహసీల్దార్‌ సీట్‌లో కూర్చొని సిబ్బందినివివరాలు అడుగుతున్న నకిలీ అధికారి

సాక్షి, సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం) : సచివాలయాల పరిశీలనకు వచ్చిన ప్రత్యేక అధికారినంటూ ఓ వ్యక్తి స్థానిక అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం, వార్డు సచివాలయాల్లో సోమవారం హల్‌చల్‌ చేశాడు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రాజమహేంద్రవరం అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి బాలాజీపేటకు చెందిన 40వ వార్డు సచివాలయ కార్యదర్శులను వెంటబెట్టుకుని ఓ వ్యక్తి వచ్చాడు. నేరుగా తహసీల్దార్‌ గదిలోకి వెళ్లి ఆయన సీట్లో కూర్చున్నాడు ‘‘నేను సీఎం కార్యాలయం నుంచి వచ్చిన స్పెషలాఫీసర్‌ను, ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది’’ ఇది నా ఐడీ అని చూపించాడు. తన పేరు ఉపేంద్ర రోషన్‌ అని తన సెల్‌ నంబర్‌: 6301814060గా చెప్పాడు. తహసీల్దార్‌ సుస్వాగతం అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్‌ బాపిరాజును పిలిచి వివరాలు అడిగాడు. బుధవారం మళ్లీ వస్తానని అప్పటికి అన్ని రికార్డులు సిద్ధం చేసి ఉంచాలని చెప్పి వెళ్లిపోయాడు. (టార్గెట్‌ వైఎస్సార్‌సీపీ! )

సందేహం కలిగిన డిప్యూటీ తహసీల్దార్‌ బాపిరాజు ప్రభుత్వ కార్యాలయానికి ఫోన్‌ చేసి ఆరా తీయగా అటువంటి వ్యక్తి ఎవరూ లేరని చెప్పారు. దీంతో సాయంత్రం ఆ వ్యక్తికి ఫోన్‌ చేసి తహసీల్దార్‌ కార్యాలయానికి రావాలని కోరగా, తొలుత వీలుపడదని చెప్పాడు. అయితే డిప్యూటీ తహసీల్దార్‌ గట్టిగా చెప్పడంతో రాత్రి ఏడు గంటలకు కార్యాలయానికి వచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న టూటౌన్‌ పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇతడు రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామానికి చెందిన వాడని, బీఎడ్‌ పూర్తి చేసి  ఖాళీగా ఉంటున్నాడని టూటౌన్‌ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగురోజులుగా రాజమహేంద్రవరంలో పలు సచివాలయాలకు వెళ్లి, తాను సీఎం పేషీ నుంచి వచ్చానని అక్కడి సిబ్బందిపై హడావుడి చేస్తూ వస్తున్నాడని తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ, కలెక్టర్‌ కార్యాలయానికి సంబంధించిన వారి ఫోన్‌ నంబర్లన్నీ అతడి ఫోన్‌లో ఉండడం కొసమెరుపు.


నకిలీ అధికారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

మరిన్ని వార్తలు