దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి

12 Feb, 2019 08:35 IST|Sakshi
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరీష్‌రాజు

కానిస్టేబుల్‌ సెలెక్షన్స్‌లో పడిపోయిన ఓ అభ్యర్థి

కాలువిరిగి పోయిన వైనం

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: కానిస్టేబుల్‌ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి చోటుచేసుకుంది. 100 మీటర్ల పరుగులో ఒక అభ్యర్థి కాలు విరగంతో అతడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏలూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎంపికలకు సంబంధించి పరుగు పోటీ నిర్వహించారు. ఈ  పోటీలో పాల్గొన్న అభ్యర్థి ఈదర హరీష్‌రాజు ప్రమాదవశాత్తు పడిపోవటంతో కాలు విరిగిపోయింది. కామవరపుకోటకు చెందిన  ఈదర జగదీష్‌రాజు ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

వారు కాకినాడలో ఉంటున్నారు. అతని కుమారుడు హరీష్‌రాజు ఏలూరు రేంజ్‌ పరిధిలోని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగ నియామక ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అలాగే ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్‌ రాత పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాడు. దీంతో ఏలూరులో నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యాడు. సోమవారం 1600 మీటర్ల పరుగులోనూ, లాంగ్‌జంప్‌లోనూ ఉత్తీర్ణత సాధించిన అనంతరం చివరిగా 100 మీటర్ల పరుగుపందెంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పడిపోవటంతో కాలు విరిగిపోయింది. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన వైద్యులు వెంటనే చికిత్స అందించి మెరుగైన చికిత్సకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

నా చిరకాల కోరిక కరిగిపోయింది
పోలీసు శాఖలో ఉద్యోగం సాధించాలనే తన చిరకాల కోరిక కలగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందని హరీష్‌రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్సై పోస్టు సాధించాలనే లక్ష్యంతో ఎంతోకాలంగా శ్రమిస్తున్నాననీ, అన్ని పరీక్షల్లోనూ విజయం సాధించాననీ, ఈ రోజు ఇలా ప్రమాదం జరగటం  కలచివేస్తోందని ఆవేదన చెందాడు. పట్టుదలతో చివరి వరకూ పోటీల్లో నిలబడి ఉత్తీర్ణత సాధించి, ఆఖరికి ఇలా కాలు విరగటం తీవ్రంగా బాధిస్తోందని విలపించాడు.

మరిన్ని వార్తలు