పెళ్లికి ససేమిరా.. పెద్దల సేవకే మొగ్గు.!

29 Jun, 2018 12:19 IST|Sakshi
దీక్ష చేస్తున్న రామలింగేశ్వరరావు

బంధువులైన వృద్ధుల కోసం ఓ యువకుడి దీక్ష

సాక్షి, అనకాపల్లిటౌన్‌ (విశాఖపట్నం): పెళ్లి చేసుకోవాలని వృద్ధులైన మేనమామలు, పెద్దమ్మలు ఒక యువకుడిని కోరుతున్నా.. తాను పెళ్లి చేసుకోనంటూ దీక్ష బూనిన ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా గత ఆరురోజులుగా కేవలం పండ్లను మాత్రమే తింటూ పెళ్లికి నిరాకరిస్తున్న యువకుడిని చూసి అక్కడి వారు విస్తుపోతున్నారు. తాను పెళ్లి చేసుకుంటే పెద్దమ్మలను, మేనమామలను వచ్చే భార్య సరిగా చూసుకోదంటూ యువకుడు అంటుంటే.. కనీసం నీ బాగోగుల కోసమైనా పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువకుడిని వీరంతా కోరుతున్నారు.

అనకాపల్లి పట్టణంలోని గాంధీనగరం కోర్టువీధిలో ఉంటున్న మణికంఠ రామలింగేశ్వరరావు ఆరు రోజులుగా పండ్లను మాత్రమే తింటూ దీక్ష చేస్తున్నాడు. తనపై ఆధారపడిన తన బంధువులైన ఐదుగురు వృద్ధులు.. తాను పెళ్లి చేసుకుంటే ఆధారం లేనివారవుతారని రామలింగేశ్వరరావు అంటున్నాడు. అందువల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఈ వృద్ధులకు ప్రభుత్వం ఏదైనా దారి చూపాలని కోరుతున్నాడు. ఈ ఐదుగురు వృద్ధులకు ప్రతి నెలా రూ.1500 విలువైన  మందులను సామాజిక కార్యకర్త గోల్డ్‌ వాసు అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు